Tech Mahindra Shares: కొత్త MD & CEO పేరు ప్రకటనతో, ఇవాళ్టి (సోమవారం, 13 మార్చి 2023) ట్రేడ్‌లో టెక్‌ మహీంద్ర షేర్లు దూసుకెళ్లాయి. డిసెంబర్ 20, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా, వచ్చే 5 సంవత్సరాల కాలానికి మోహిత్ జోషిని ‍‌(Mohit Joshi) మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకటనతో, IT మేజర్ టెక్ మహీంద్రా షేర్లు ఇంట్రాడే ట్రేడ్‌లో దాదాపు 10% జంప్ చేసి రూ. 1,164.50 కి చేరుకున్నాయి. 


ఉదయం 11.50 గంటల సమయానికి, BSEలో, టెక్‌ మహీంద్ర స్క్రిప్ 7.98% పెరిగి రూ. 1,146 వద్ద ట్రేడవుతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ‍‌(YTD), ఈ స్టాక్ 14% వరకు లాభపడంది. అయితే, గత 12 నెలల (ఒక సంవత్సరం) కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, ఈ కౌంటర్‌ దాదాపు 24% నష్టపోయింది.


టెక్‌ మహీంద్ర ప్రస్తుత MD & CEO సీపీ గుర్నానీ (CP Gurnani) డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలోకి జోషి వస్తారు.


జోషికి ఇన్ఫోసిస్‌లో 22 ఏళ్ల అనుభవం
దేశంలోని రెండో అతి పెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో 22 ఏళ్ల పాటు జోషి పని చేశారు. ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వ్యాపారాలను మోహిత్ జోషి చూసుకున్నారు. ఈ IT సంస్థ సాఫ్ట్‌వేర్ & ప్రొడక్ట్స్‌ విభాగం అయిన ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్‌కు ‍‌(Edgeverve Systems) ఛైర్మన్‌గా కూడా పని చేశారు. 22 ఏళ్ల ప్రయాణం తర్వాత, ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ పదవికి జోషి రాజీనామా సమర్పించారు. ప్రస్తుతం సెలవులో ఉన్నారు. జూన్ 9, 2023 నుంచి రాజీనామా అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్‌ తెలిపింది. 


జోషిని తీసుకురావడంపై మార్కెట్‌ సానుకూలం
జోషి నియామకం మహీంద్ర గ్రూప్‌ కంపెనీకి కలిసి వస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కంపెనీ వ్యాపార వ్యూహం, స్టాక్ కోణం నుంచి ఈ నియామకాన్ని సానుకూలంగా చూస్తున్నారు. అందువల్లే, స్టాక్‌ ఇవాళ హై జంప్‌ చేసింది.


“టెక్ మహీంద్రకి ఇది పెద్ద సానుకూలాంశం. స్టాక్ వాల్యుయేషన్‌లో రీరేటింగ్‌ కనిపించవచ్చు. టెక్ మహీంద్ర ఆదాయ ప్రయోజనాలు, కార్యాచరణ నైపుణ్యం రెండింటినీ జోషి తీసుకువస్తారు” - ఎలారా క్యాపిటల్‌లోని ఈక్విటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ రుచి బుర్దే ముఖిజా


“టెక్‌ఎమ్‌కి కావలసింది స్ట్రాటజీ రీఫ్రెష్. టైర్-1 సంస్థల్లో అత్యల్ప మార్జిన్‌ను ఈ కంపెనీ కలిగి ఉంది. లార్జ్‌ డీల్స్‌తో వేగవంతమైన ఆర్గానిక్‌ గ్రోత్‌ కూడా కంపెనీకి అవసరం. BFSI (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), హెల్త్‌కేర్, యూరప్, సేల్స్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మోహిత్ అనుభవం టెక్ మహీంద్రకు ఉపయోగపడుతుంది"  - పరీఖ్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు పరీఖ్ జైన్


"టెక్‌ఎమ్ పనితీరును పునరుద్ధరించడానికి కొత్త CEO నియామకంపై మార్కెట్ సానుకూలంగా ప్రతిస్పందించవచ్చు. అయితే, మీడియం టర్మ్‌లో ‍‌(2-3 సంవత్సరాలు) కంపెనీ ఎర్నింగ్స్‌ ఫండమెంటల్స్‌ను నాయకత్వ మార్పు మార్చగలదని మేం నమ్మడం లేదు. ఫండమెంటల్స్ పునరుద్ధరణ అనేది కాలక్రమేణా జరిగే ప్రక్రియ" - ICICI సెక్యూరిటీస్ తెలిపింది.


టెక్ మహీంద్ర స్టాక్‌కు "రెడ్యూస్" రేటింగ్‌ ఇచ్చిన  ICICI సెక్యూరిటీస్, ఒక్కో షేరుకు రూ. 971 టార్గెట్ ధరను కొనసాగించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.