Reliance Industries Shares: సముద్రంలోని చమురు నుంచి ఆకాశంలోని తరంగాల వరకు అన్ని వ్యాపారాలు చేస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (Reliance Industries Ltd), ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY23) ఫలితాలను ఇవాళ (శుక్రవారం) విడుదల చేయబోతోంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు కోట్ల మంది షేర్‌హోల్డర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలకు ముందు, స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పట్టు జారి పడిపోతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో అర శాతం పైగా తగ్గాయి. మధ్యాహ్నం 12.35 గంటల సమయానికి BSEలో ఈ స్క్రిప్ 0.58 శాతం క్షీణించి రూ. 2,486 స్థాయికి చేరుకుంది. 


ఎంకే గ్లోబల్ అంచనా
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం గత ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలోని రూ. 13,680 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 14,388.60 కోట్లకు పెరగవచ్చని రీసెర్చ్‌ హౌస్‌ ఎంకే గ్లోబల్ (Emkay Global) అంచనా వేసింది. అమ్మకాలు కూడా గత సంవత్సరం కంటే 23.9 శాతం పెరిగి రూ. 2,14,186 కోట్లకు చేరుకోవచ్చని చెబుతోంది. 


అయితే, ఎబిటా (Ebitda) మార్జిన్‌లో తగ్గుదలను చూస్తోందీ బ్రోకరేజ్‌. జూన్‌ త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎబిటా మార్జిన్‌ 17.3 శాతం. సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 15.5 శాతంగా ఉంది. సమీక్ష కాల త్రైమాసికంలో ఈ నంబర్‌ 15.3 శాతానికి దిగి వస్తుందని చెబుతోంది.


IIFL సెక్యూరిటీస్ అంచనా
'బిజినెస్ టు కన్స్యూమర్' (B2C) వ్యాపారాలయిన రిటైల్ (Retail), జియోలో (Jio) మంచి ట్రాక్షన్‌ను IIFL సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నప్పటికీ; 'ఆయిల్ టు కెమికల్' (O2C) వ్యాపారం ఇది అధ్వాన్న త్రైమాసికాల్లో ఒకటిగా మిగులుతుందని తెలిపింది. గ్రాస్‌ రిఫైనింగ్ మార్జిన్ల (GRMలు) పతనం, పెట్రోకెమికల్ డిమాండ్ తగ్గడం దీనికి కారణాలుగా వెల్లడించింది. 


రూపాయి విలువ క్షీణించడం, బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం కూడా ఒక ఓవర్‌హాంగ్‌గా  IIFL సెక్యూరిటీస్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.


E&P (చమురు అన్వేషణ & ఉత్పత్తి) వ్యాపారం బలంగా ఉండవలసిన అవసరం ఉండగా, ఈ విభాగం ఆదాయం తక్కువగా ఉంది. రిటైల్‌ విభాగంలో 36 శాతం YoY అమ్మకాల వృద్ధిని, 7.5 శాతం కోర్‌ మార్జిన్‌లను అంచనా వేస్తున్నాం. రిలయన్స్‌ టెలికాం వ్యాపారంలో 10 శాతం QoQ వృద్ధిని అంచనా వేస్తున్నాం. - IIFL సెక్యూరిటీస్


రిలయన్స్‌ ఏకీకృత లాభం గత సంవత్సరం కంటే 7 శాతం పెరిగి రూ. 14,683 కోట్లకు చేరుతుందని ఈ బ్రోకరేజ్ లెక్క కట్టింది.


మరో బ్రోకరేజ్‌ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (Kotak Institutional Equities) అంచనా ప్రకారం... రిలయన్స్‌ నికర లాభం 27.8 శాతం YoY పెరిగి రూ. 17,484 కోట్లకు చేరుకుంటుంది. విక్రయాలు 43.8 శాతం పెరిగి రూ. 2,41,004 కోట్లుగా నమోదవుతాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.