Sensex Record High: దలాల్‌ స్ట్రీట్‌ ఇన్వెస్టర్లు ఈ రోజు కోసం 137 రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇవాళ (బుధవారం, 21 జూన్‌ 2023), BSE సెన్సెక్స్‌ చరిత్రలో మరో మైలురాయిగా మారింది. ఈ హెడ్‌లైన్‌ ఇండెక్స్‌ 63,588 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని (Sensex lifetime record high) సృష్టించింది. గత ఏడాది డిసెంబర్ 1 నాటి గరిష్ట స్థాయి (63,284) ఇవాళ చరిత్రలో కలిసిపోయింది.


FY24లో ఫారిన్‌ ఇన్వెస్టర్లు (FIIs) ఫుల్‌ రైజ్‌లో ఉన్నారు. దలాల్ స్ట్రీట్ కోసం 9 బిలియన్‌ డాలర్ల భారీ వాలెట్‌ తీసుకొచ్చారు. ఫారినర్ల చలవతో సెన్సెక్స్ ఈరోజు 63,588 వద్ద లైఫ్‌ టైమ్‌ హై పాయింట్‌ను టచ్‌ చేసింది. 


అయితే, తోటి ఇండెక్స్‌ NSE నిఫ్టీ ఇప్పటికీ దాని గత గరిష్ట స్థాయి దగ్గరలో తచ్చాడుతోంది. నిఫ్టీ 500, నిఫ్టీ మిడ్‌ క్యాప్, నిఫ్టీ స్మాల్‌ క్యాప్ వంటి ఇతర NSE సూచీలు ఈ రోజు కొత్త గరిష్టాలను స్కేల్ చేశాయి.


అనుకోకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవం (‌జూన్‌ 21) రోజే సెన్సెక్స్ కొత్త శిఖరాన్ని చేరింది. ఇది, ఎలాంటి హఠాత్‌ షాక్స్‌ ఇవ్వకుండా, నమ్మదిగా పైకి గానీ, కిందకు కదులుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. అయితే, ఇండియన్‌ ఎకానమీ స్వీట్‌ స్పాట్‌లో ఉందని దేశీ, విదేశీ పెట్టుబడిదార్లు విశ్వసిస్తున్న నేపథ్యంలో, ఓవరాల్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా ఉంది.


గత గరిష్ట స్థాయి నుంచి సెక్టార్స్‌ పనితీరు
2022 డిసెంబర్ 1 నాటి సెన్సెక్స్ గరిష్ట స్థాయి నుంచి ఇప్పటి గరిష్ట స్థాయి వరకు... క్యాపిటల్ గూడ్స్, FMCG, రియాల్టీ, ఆటో, PSU స్టాక్స్ రెండంకెల లాభాలతో ఔట్‌పెర్ఫార్మ్‌ చేశాయి. ప్రభుత్వం నుంచి భారీ కాపెక్స్ ప్లాన్స్‌, ప్రైవేట్ క్యాపెక్స్ కూడా పుంజుకుంటుందనే సంకేతాలతో, BSE క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ ఈ కాలంలో 17% రాబడి సాధించి, టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది.


గత గరిష్ట స్థాయి నుంచి స్టాక్స్‌ పనితీరు
డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు, 33% రాబడితో ITC బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. దీంతో పెట్టుబడిదార్లు దాదాపు $18 బిలియన్ల వరకు ధనవంతులు అయ్యారు. టాటా మోటార్స్, నెస్లే, లార్సెన్ & టూబ్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టైటన్ కంపెనీ, పవర్ గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ రెండంకెల రాబడిని అందించిన ఇతర ఏడు స్టాక్‌లు.


ITC  33.4%
టాటా మోటా  33.1%
నెస్లే ఇండియా  14.4%
లార్సెన్ & టూబ్రో 13.2%
అల్ట్రాటెక్ సిమెంట్ 13.2%
టైటన్ కంపెనీ 12.5%
పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ 12.2%
ఇండస్‌ఇండ్ బ్యాంక్ 10.6%


నష్ట జాతక కౌంటర్లు
మరోవైపు... రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), ఇన్ఫోసిస్ ఇండెక్స్‌లో అతి పెద్ద నష్ట జాతక కౌంటర్లుగా మిగిలాయి. డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు అవి దాదాపు $35 బిలియన్లను పోగొట్టాయి. గత సెన్సెక్స్ గరిష్ట స్థాయి నుండి ఇన్ఫోసిస్ షేర్లు 21% క్షీణించగా, RIL 6.5% నష్టపోయింది. విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, TCS, SBI కూడా నష్ట జాతక స్టాక్స్‌ లిస్ట్‌లోకి ఎక్కాయి.


ఈ 137 ట్రేడింగ్ సెషన్ల కాలంలో, BSEలోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.6 లక్షల కోట్లు పెరిగి రూ. 294.49 లక్షల కోట్లకు చేరుకుంది. మిడ్ & స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ అద్భుతంగా రాణించాయి.


మరో ఆసక్తికర కథనం: ఇల్లు కడుతున్నారా?, ఈ వార్త చదివితే ఎగిరి గంతేస్తారు 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial