Cement Prices In India: సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్లకు గుడ్ న్యూస్. మరికొన్నాళ్లలో ఇంటి నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉంది. సిమెంట్ రేట్లు రానున్న రోజుల్లో 1 నుంచి 3 శాతం వరకు తగ్గవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (Crisil) చెబుతోంది. ప్రస్తుతం, భారతదేశంలో సిమెంట్ ధరలు మంటపుట్టిస్తున్నాయి, రికార్డు స్థాయిలో ఉన్నాయి.
మంట పుట్టిస్తున్న సిమెంట్ రేట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ బస్తా రేటు 1-3 శాతం వరకు తగ్గవచ్చని క్రిసిల్ పేర్కొంది. గత 4 సంవత్సరాల్లో, సిమెంట్ ధరలు ఏటా 4 శాతం పెరుగుతూ వెళ్లాయి. దీంతో, ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి, ఇంటి నిర్మాణాన్ని పెనుభారంగా మార్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి, 50 కిలోల బస్తా ధర రూ. 391కి చేరింది.
సిమెంట్ ఇండస్ట్రీకి మంచి రోజులు
సిమెంట్ పరిశ్రమలో పోటీ తీవ్రంగా ఉందని క్రిసిల్ చెబుతోంది. ఈ కారణంగానే సిమెంట్ ప్రైజెస్ చల్లబడవచ్చని, రానున్న రోజుల్లోనూ ఇంకా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సిమెంట్ తయారీ వ్యయంలో ఇంధన ఛార్జీలది కూడా పెద్ద వాటా. ఇప్పుడు, అంతర్జాతీయ మార్కెట్‌లో కోల్ రేట్లు తగ్గడం వల్ల, కంపెనీల ఎనర్జీ కాస్ట్ కూడా తగ్గింది. ఫైనల్‌గా సిమెంట్ రేట్లు మెత్తబడ అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2023 జనవరి-మార్చి కాలం), సిమెంట్ కంపెనీలు మరింత ఎక్కువ మార్కెట్ షేర్ కోసం పోటీ పడ్డాయి. ఈ కారణంగా 2023 ప్రారంభంలో ధరలు కొంత తగ్గాయి.
క్రిసిల్ డేటా ప్రకారం, 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో సిమెంట్ ధరలు సగటున 1 శాతం తగ్గాయి, 50 కిలోల బస్తాకు సగటున రూ. 388కి చేరాయి. రేటు తగ్గినా, ఇది ఇప్పటికీ గరిష్ఠ స్థాయిలోనే ఉంది. కాబట్టి, ధర తగ్గడానికి ఇంకా అవకాశం ఉంది. వర్షాకాలానికి ముందు ఏప్రిల్, మే నెలలు సిమెంట్ డిమాండ్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. సాధారణంగా ఆ సమయానికి సిమెంట్ కంపెనీలు రేట్లు పెంచుతాయి, ఈ ఏడాది మాత్రం పెంచలేదు. ఇలా జరగడం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని కూడా తన రిపోర్ట్‌లో క్రిసిల్ వెల్లడించింది. వర్షాకాలంలో నిర్మాణాలు & సిమెంట్ డిమాండ్ రెండు తగ్గడం ఆనవాయితీ. ప్రస్తుతం మాన్‌సూన్ సీజన్ స్టార్టయింది కాబట్టి, సిమెంట్ రేట్లు మెత్తబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దేశీయ, అంతర్జాతీయ కారణాలు
రాబోయే రోజుల్లో, బొగ్గు ధరలను ఆస్ట్రేలియా తగ్గించడం, అంతర్జాతీయ & దేశీయ పెట్ కోక్ ప్రైస్ తగ్గింపు వాటి కారణాల వల్ల సిమెంట్ రేట్లు తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ నమ్ముతోంది. డీజిల్ ధరలు తగ్గుతాయన్న అంచనాలు కూడా సిమెంట్ ఇండస్ట్రీకి సపోర్ట్‌గా మారింది.
ఒక ఇల్లు కట్టాలంటే, నిర్మాణ సామగ్రి కోసమే ఎక్కువ ఖర్చు చేయాలి. క్రిసిల్ నివేదిక నిజమైతే, రాబోయే రోజుల్లో మీ డ్రీమ్ హోమ్ నిర్మాణం మరింత చౌకగా మారవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్, ఈ నెలాఖరు వరకే ఛాన్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial