బుధవారం (జనవరి 17) ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1628 పాయింట్లు లేదా 2.23 శాతం తగ్గి.. భారీ నష్టంతో 71500 వద్ద ముగిసింది. నిఫ్టీ 460 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 21572 వద్ద ముగిసింది. గత 16 నెలల కాలంలో సూచీలు ఇంతలా దిగజారడం ఇదే అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో, బీఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.33 లక్షల కోట్లు తగ్గి రూ.370.62 లక్షల కోట్లకు చేరింది.


బెంచ్‌మార్క్ సూచీలలో అత్యధిక ప్రాధాన్యం ఉన్న స్టాక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 8.5 శాతానికి దిగువన ముగిసింది. వరుసగా రెండో త్రైమాసికంలో స్థిరమైన మార్జిన్‌లను నివేదించిన తర్వాత 2020 మార్చి 23 నుంచి పోల్చితే అత్యధిక శాతం పడిపోయింది. ఉదయం సెషన్ ప్రారంభమైన వెంటనే షేరు ధర దాదాపు 7 శాతం పడిపోయింది. మూడో త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ నికర లాభం 34 శాతం పెరిగనప్పటికీ, లోన్ గ్రోత్, మార్జిన్లపై ఇన్వెస్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు ధర ఒక్క రోజే ఈ స్థాయిలో పడిపోయింది.


పశ్చిమాసియాలో ఆందోళనలు, వడ్డీ రేట్లలో కోతతో ఆశలు సన్నగిల్లడం, దేశీయ సూచీల్లో ప్రధాన లిస్టెడ్ కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం లాంటి కారణాలతో మార్కెట్లు డీలా పడ్డాయి. ఇటీవల వరుస లాభాలతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలకు చేరిన వేళ మదుపరులు లాభాల కోసం.. అమ్మకాలకు దిగడం కూడా మరో కారణంగా తెలుస్తోంది.