Vangaveeti Radhakrishna condemned party changing Rumors :  ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నట్లుగా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని వంగవీటి రాధాకృష్ణ ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని. గాలి పార్టీ గాలి వార్తలను నమ్మొద్దని సూచించారు.  మీకు కనీసం ఆత్మ తృప్తి కావాలంటే వైసీపీ నేతలే  టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.         

  


కాపు నేతల్ని ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రయత్నం                 


పవన్ కల్యాణ్ వల్ల కాపు సామాజికవర్గం మొత్తం టీడీపీ, జనసేన  కూటమి వైపు వెళ్తుందన్న అంచనాల కారణంగా ఇటీవలి కాలంలో బలమైన కాపు నేతల్ని చేర్చుకునేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో క్రికెటర్ అంబటి రాయుడ్ని పార్టీలో చేర్చుకున్నారు. కొన్నాళ్ల పాటు గ్రౌండ్ వర్క్ చేసి తర్వాత వైసీపీలో చేరారు. కానీ ఆయన పది రోజుల్లోనే పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరో సీనియర్ కాపు లీడర్ అయిన  ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఏం జరిగిందో కానీ  చివరిలో వెనుకడుగు వేశారు. ఇప్పుడు తాను  జనసేన లేదా టీడీపీల్లో చేరతామని లేకపోతే సైలెంట్ గా ఉంటామని చెబుతున్నారు. 


కొడాలి నాని ద్వారా వంగవీటితో చర్చలు జరిపారని ప్రచారం                  


ఈ క్రమంలో వంగవీటి రాధాకృష్ణను చేర్చుకునేందుకు వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో వైసీపీలోనే ఉన్న వంగవీటి రాధాకృష్ణ గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. వైసీపీలో సీఎం జగన్ తనను అవమానించారని మండిపడ్డారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు కానీ పోటీ చేయలేదు. ఈ సారి కూడా ఆయన పోటీ చేసే స్థానంపై క్లారిటీ లేదు. వైసీపీలో ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇద్దరూ వంగవీటి రాధాకృష్ణకు మిత్రులు. ఇటీవల కొడాలి నానితో కలిసి కాశీలో కూడా పర్యటించి వచ్చారు రాధాకృష్ణ. ఆ ఫోటోలు వైరల్ కావడంతో.. వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. 


టీడీపీని వదిలే ప్రశ్నే లేదన్న వంగవీటి రాధాకృష్ణ             


అయితే కొడాలి నానితో వ్యక్తిగత స్నేహం మాత్రమే ఉందని రాజకీయాలకు సంబంధం లేదని వంగవీటి చెబుతున్నారు. రాజకీయంగా తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటున్నారు. వంగవీటి రాధాకృష్ణ పార్టీలోకి  వస్తే విజయవాడ సెంట్రల్ సీటును ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో తనను ఎంతో అవమానించిన పార్టీలోకి వెళ్లేది లేదని వంగవీటి చెబుతున్నారు. మొత్తంగా కాపు నేతల్ని ఆకర్షించాలన్న జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఎక్కడిక్కడ ఫెయిలవుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.