దేశీయ ఈక్విటీ సూచీలు ట్రేడింగ్ చివరి గంటలో ఉవ్వెత్తున ఎగబాకాయి. బ్యాంకింగ్ షేర్లలో పెరుగుదల కారణంగా రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగా చెబుతున్నారు. నేడు సెన్సెక్స్ కనిష్ట స్థాయి నుంచి 694 పాయింట్లు కోలుకుని 74,018.39 వద్ద రికార్డు స్థాయికి చేరింది. మరోవైపు, నిఫ్టీ సూచీ 22,453.95 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం 2:39 గంటల సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 74,006.89 వద్ద, నిఫ్టీ సూచీ 102 పాయింట్లు పెరిగి 22,458.60 వద్ద ఉన్నాయి.


నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ - నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లో 12 బ్యాంకింగ్ షేర్ల గేజ్ 568 పాయింట్లు పెరిగి 48,143 వద్ద.. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల నేపథ్యంలో మార్కెట్లలో పెరుగుదల వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర షేర్లు సెన్సెక్స్‌లో టాప్ మూవర్‌లుగా ఉన్నాయి.


నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో 13 మేజర్ సెక్టార్ గేజ్‌లలో తొమ్మిది.. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం లాభంతో ట్రేడింగ్‌లో ఉన్నాయి. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీలు కూడా 0.5-1 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు, మెటల్, మీడియా, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ మిడ్‌ క్యాప్ 100 ఇండెక్స్ ఒక శాతం క్షీణించగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ రెండు శాతం దిగజారింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.


నిఫ్టీలో కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్‌గా ఉంది. దీని స్టాక్ 2.7 శాతం పెరిగి రూ.1,762కి చేరుకుంది. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, ఎస్‌బీఐ లైఫ్, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా 1 నుంచి 2.4 శాతం మధ్య ఎగబాకాయి. ఫ్లిప్‌సైడ్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌టీపీసీ, భారత్ పెట్రోలియం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి.