Stock Market Update: Q4 రిపోర్ట్ కార్డ్‌లోని అన్ని గడుల్లో బలహీన నంబర్లను ఇన్ఫోసిస్ నింపడంతో, మొత్తం IT స్టాక్స్ పెట్టుబడిదార్ల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో, గత 9 రోజుల సెన్సెక్స్ విజయ పరంపరకు బ్రేక్‌ పడింది. బెంచ్‌మార్క్‌ ఇవాళ (సోమవారం, 17 ఏప్రిల్‌ 2023) దాదాపు 950 పాయింట్లను కోల్పోయింది.


సెన్సెక్స్ 60,000 దిగువకు జారిపోగా, నిఫ్టీ 17,600 స్థాయికి దిగువకు పడిపోయింది. ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ షేర్లు 12% కుప్పకూలాయి, రెండు సూచీలను ఇది భారీగా కిందకు లాగింది. IT కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, టిసీఎస్, విప్రో 6% వరకు దిగజారాయి.


FIIల భారీ కొనుగోళ్లతో, సెన్సెక్స్ గత తొమ్మిది రోజుల్లో 2,800 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది. ఆ పార్టీని ఈ రోజు ఐటీ స్టాక్స్‌ చెడగొట్టాయి.


సెన్సెక్స్ పతనం వెనుకున్న 6 బలమైన శక్తులు:


1) ఐటీలో బలహీనతలు
మార్కెట్‌ ఊహించిన దాని కంటే బలహీనమైన సంఖ్యలను ఇన్ఫోసిస్ ప్రకటించడంతో, దలాల్ స్ట్రీట్‌లో ఎలుగుబంట్లు పంజా విప్పాయి. ఆ దెబ్బ తోటి స్టాక్స్‌పైనా పడింది, నిఫ్టీ IT ఇండెక్స్ 6.5% నష్టపోయింది. వివిధ బ్రోకరేజీలు ఇన్ఫోసిస్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసి, టార్గెట్ ధరలను తగ్గించాయి.


బ్రోకరేజ్‌ నొమురా, ఇన్ఫోసిస్‌పై తన టార్గెట్ ధరను ఏకంగా 22% తగ్గించి రూ. 1,290కి చేర్చింది.


2) HDFC బ్యాంక్ సంపాదన తగ్గడం
HDFC బ్యాంక్ Q4 లాభం, నికర వడ్డీ ఆదాయంలో (NII) వృద్ధి ఊహించిన దాని కంటే కాస్త తక్కువగా వచ్చింది. HDFC కవలలకు ఉన్న హెవీ వెయిటేజీ కారణంగా సెన్సెక్స్ క్షీణతలో ఈ రెండూ పెద్ద పాత్ర పోషించాయి. HDFC, HDFC తలో 2% చొప్పున పడిపోయాయి.


3) ప్రపంచ సంకేతాలు ప్రతికూలం
ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీచి ఉంటే ఎలుగుబంట్లు శాంతించి ఉండేవి. అలా జరక్కపోవడంతో సెన్సెక్స్‌ మీద దాడికి దిగాయి. జపాన్ నిక్కీ ఫ్లాట్‌గా ఉండగా, ఆస్ట్రేలియా S&P/ASX 200 కేవలం 0.2%, దక్షిణ కొరియా కోస్పి 0.2%, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ 0.2% చొప్పున గ్రీన్‌లో ఉన్నాయి.


వాల్ స్ట్రీట్‌ స్టాక్స్‌ గత వారం లోయర్‌ సైడ్‌లో ముగిశాయి. ఆదాయాల సీజన్‌కు శుభారంభం దక్కకుండా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు అడ్డుకున్నాయి.


4) ప్రాఫిట్ బుకింగ్
గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో 5% ప్లస్ ర్యాలీ కనిపించినా, Q4 ఎర్నింగ్స్‌ సీజన్‌ బలహీనపడడంతో, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్లు లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. FIIల చలవ వల్ల గత సెషన్లలో కొనుగోళ్లు జరిగాయి.


5) సాంకేతిక అంశాలు
టెక్నికల్‌ చార్ట్‌ల ప్రకారం, ఇటీవలి అప్‌ మూవ్‌ను మరింత పైకి తీసుకెళ్లేందుకు ఇంటెక్స్‌లకు బలం సరిపోవడం లేదు. దీంతో పాటు మొమెంటం సూచికలు ఓవర్‌బాట్‌లో ఉన్నాయి. నిఫ్టీ ప్రస్తుతం 17700 - 17600 జోన్‌లోకి, తక్షణ మద్దతు కంటే కిందకు వెళ్లింది. ఇప్పుడు, 200-SMA దగ్గరున్న 17,500 స్థాయి తక్షణ మద్దతుగా పని చేసే అవకాశం ఉంది.


6) బాండ్ ఈల్డ్స్‌లో పెరుగుదల
10 సంవత్సరాల US ఈల్డ్స్‌ 3.5% మార్కును దాటింది. ఎందుకంటే, తదుపరి పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకుండా ఫెడ్‌ను నిరోధించేంత గట్టిగా అక్కడి ఆర్థిక వ్యవస్థ లేదు. 2 సంవత్సరాల US బాండ్ ఈల్డ్స్‌ గత వారం 12 bps పెరిగాయి.


మార్కెట్‌ ఆశిస్తున్న ప్రకారం, మే 2-3 తేదీల్లో జరిగే సమావేశంలో ఫెడ్ రేటు మరో 25 bps పెరిగే అవకాశం ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.