Sebi - Adani: అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెనక్కు తీసుకున్న ఎఫ్‌పీవో (Adani Enterprises FPO) మీద భారత మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) ఆర్థిక మంత్రిత్వ శాఖకు అప్‌డేట్ చేయనుందని నమ్మకమైన సమాచారం వచ్చింది. 


హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల (Adani Group Stocks) విలువలు పతనమయ్యాయి. కొన్నేళ్లుగా జరిగిన షేర్ల క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగాయని, అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న విదేశీ కంపెనీలతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లను కొనిపించి కృత్రిమ డిమాండ్‌ సృష్టించారని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. 2023 జనవరి 24 హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్ బయటకు వచ్చింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవో మీదే ఫోకస్‌?
రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత, జనవరి 27-31 తేదీల మధ్య, రూ. 20,000 కోట్ల విలువైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవో జరిగింది. మూడు రోజుల ఎఫ్‌పీవోలో... మొదటి రెండు రోజులు చాలా చప్పగా గడిచినా, చివరిదైన మూడో రోజు మాత్రం అన్ని షేర్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. మొత్తంగా చూస్తే.. రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ ఫ్లాప్‌ అయినా, సంస్థాగత పెట్టుబడిదార్ల వాటా పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. యాంకర్‌ రౌండ్‌లోనూ గ్లోబర్‌ ఇన్వెస్టర్లు పాల్గొని పెట్టుబడులు పెట్టారు. ఎఫ్‌పీఓను గట్టెక్కించేందుకు కొన్ని సంస్థలు అదానీ గ్రూప్‌తో లాలూచీ పడ్డాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంటే, షేర్ల పతనం కారణంగా ఎఫ్‌పీవో ధర కంటే తక్కువ ధరకే అప్పుడు ఓపెన్‌ మార్కెట్‌లో షేర్లు అందుబాటులో ఉన్నాయి. అయినా, కొన్ని పెట్టుబడి కంపెనీలు ఎక్కువ రేటు పెట్టి ఎఫ్‌పీవోలో షేర్లు కొనడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో, రూ. 20 వేల కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రద్దు చేసింది.


ఎఫ్‌పీవోలో పాల్గొనే యాంకర్‌ ఇన్వెస్టర్లకు కంపెనీ యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండకూడదని నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓలో నిబంధనలను పట్టించుకోలేదా అనే కోణంలో సెబీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు, ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌లో (ఎఫ్‌పీఓ) షేర్లు కొన్న రెండు బడా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలతో అదానీ గ్రూప్‌నకు ఉన్న సంబంధాలపైనా ఆరా తీసినట్లు సమాచారం.


ఆర్థిక మంత్రితో బుధవారం సమావేశం!
ఈ నెల 15న (బుధవారం), ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సెబీ అధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ స్టాక్స్‌ ఇటీవల పతనమైన సమయంలో రెగ్యులేటర్ తీసుకున్న నిఘా చర్యలపై ఆర్థిక మంత్రికి సెబీ బోర్డు వివరిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి, తమ పేరు బయట పెట్టవద్దని వెల్లడించాయి. అదానీ గ్రూప్ సంస్థల్లోకి ఆఫ్‌షోర్ ఫండ్ ప్రవాహాలపై (విదేశీ పెట్టుబడులు) గురించి కూడా అప్‌డేట్‌ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్పాయి. 


అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ మార్కెట్‌ రూట్‌, ట్రేడ్‌ ప్యాట్రన్స్‌, ఎఫ్‌పీవోలో షేర్‌ సేల్‌, విదేశీ పెట్టుబడులు వంటి అన్ని విషయాల మీదా ఆర్థిక శాఖకు సెబీ బోర్డ్‌ నివేదించనున్నట్లు తెలుస్తోంది. 


దీని మీద కామెంట్‌ కోసం సెబీకి రాయిటర్స్ ఒక ఈ-మెయిల్‌కు పంపినా సెబీ అధికారులు స్పందించలేదు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.