Special Platform For Pre-listing Trading: ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (IPO) ఇన్వెస్టర్లకు మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ (SEBI) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. IPOలో షేర్లు దక్కించుకున్న ఇన్వెస్టర్లు, మార్కెట్‌లో లిస్ట్‌ కాకముందే ఆ షేర్లను కొనుగోలు లేదా విక్రయించే ‍‌(ప్రి-లిస్టింగ్‌ ట్రేడింగ్‌) అవకాశం కల్పించేందుకు ఒక అధికారిక ఫ్లాట్‌ఫామ్‌ లాంచ్‌ చేసే యోజనలో ఉంది. సెబీ చైర్‌ పర్సన్ మాధబి పురి బచ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మంగళవారం AIBI (అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్స్‌ ఆఫ్‌ ఇండియా) మీటింగ్‌లో మాట్లాడిన సెబీ ఛైర్‌ పర్సన్‌, “షేర్ల కేటాయింపు ప్రారంభమైనప్పటి నుంచి ట్రేడింగ్ ప్రారంభం వరకు, పెట్టుబడిదారులకు ఆ షేర్లపై ఆసక్తి ఉంటుంది. ఈ కాలంలో, పెట్టుబడిదారులు ట్రేడ్‌ చేయాలనుకుంటే వారికి చట్టబద్ధమైన అవకాశం ఇవ్వాలి" అని చెప్పారు. 

IPO షేర్ల నియంత్రిత ట్రేడింగ్IPO క్లోజ్‌ అయిన తర్వాత, ఆ షేర్లు స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో (BSE, NSE) లిస్ట్‌ కావడానికి 3 రోజుల సమయం ఉంటోంది. ఈ మూడు రోజుల వ్యవధిలో, అనధికార మార్కెట్‌లో (గ్రే మార్కెట్‌) IPO షేర్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కంపెనీని బట్టి ఆయా షేర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. దీనివల్ల, షేర్లు ఐపీవో ధర కంటే భారీ ప్రీమియంతో లిస్ట్‌ అవుతున్నాయి, తొలిరోజు అధిక ధర వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక అధికారిక ఫ్లాట్‌ఫామ్‌ సృష్టించి, అనధికార మార్కెట్‌లో జరిగే  IPO షేర్ల క్రయవిక్రయాలను అధికారిక ఫ్లాట్‌ఫామ్‌ ద్వారానే కొనసాగేలా చూడాలన్నది సెబీ ఆలోచన.

"మార్కెట్‌లో ట్రేడింగ్‌ ప్రారంభం కానప్పటికీ.. IPO షేర్ల అలాట్‌మెంట్‌ జరిగిందంటేనే ఇన్వెస్టర్‌లు ఆ షేర్లకు యజమానులుగా మారినట్లు. ప్రస్తుతం, లిస్టింగ్ సమయం వరకు షేర్లు డీమ్యాట్ ఖాతాలో ఫ్రీజింగ్‌ పొజిషన్‌లో ఉంటున్నాయి. తద్వారా లిస్టింగ్‌ జరగని షేర్ల ట్రేడింగ్ నిలిచిపోతోంది. ఇప్పుడు, కొత్త విధానంలో, IPO షేర్లను డీమ్యాట్ ఖాతాకు బదిలీ చేసి లిస్టింగ్ లోపు వాటి ట్రేడింగ్‌కు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నాం" -  సెబీ చైర్‌ పర్సన్ మాధబి పురి బచ్ 

ప్రి-లిస్టింగ్‌ ట్రేడింగ్‌కు ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించే విషయమై స్టాక్‌ ఎక్స్ఛేంజీలతో చర్చిస్తున్నట్లు సెబీ ఛైర్‌ పర్సన్‌ వివరించారు. 

గ్రే-మార్కెట్‌కు కళ్లెం వేసేందుకు..గ్రే మార్కెట్‌లో అక్రమ ట్రేడింగ్‌ను అరికట్టేందుకు సెబీ ఈ చర్య తీసుకోబోతోంది. గత కొన్నేళ్లుగా IPOల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ప్రైమరీ మార్కెట్ వాతావరణంలో సందడి కనిపిస్తోంది. సంవత్సరం మొదటి రెండు వారాల్లో, చాలా కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి IPOలను ప్రారంభించగా, ఇంకా చాలా కంపెనీలు క్యూలో ఉన్నాయి. 

గ్రే మార్కెట్ అంటే ఏమిటి? గ్రే మార్కెట్ అంటే అనధికారిక & నియంత్రణ లేని మార్కెట్. ఇక్కడ, IPOలను ప్రారంభించే కంపెనీల షేర్లు కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ ట్రేడింగ్ సెబీ నిబంధనలకు అతీతంగా జరుగుతుంది. కాబట్టి, గ్రే మార్కెట్‌లో ఏదైనా మోసం జరిగినా SEBI బాధ్యత వహించదు. 

మరో ఆసక్తికర కథనం: డబ్బుతో సిద్ధంగా ఉండండి, త్వరలో 6 కొత్త IPOలు ప్రారంభం