Sebi on YouTube Channels: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకుండా.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి (Arshad Warsi), అతని భార్య మరియా గోరెట్టిపై (Maria Goretti) సెబీ నిషేధం విధించింది. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను ఉపయోగించి షేర్ల ధరలను కృత్రిమంగా పెంచినందుకు, సాధ్నా బ్రాడ్‌కాస్ట్ కంపెనీ ప్రమోటర్లు సహా 31 సంస్థలను కూడా నిషేధించింది. కొన్ని కంపెనీల షేర్ల ధరల్లో రిగ్గింగ్ జరిగినట్లు ("పంప్‌ & డంప్‌") ఏప్రిల్ - సెప్టెంబర్ 2022 కాలంలో SEBIకి ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన సెబీ, ఈ నిర్ణయం తీసుకుంది.


"పంప్‌ & డంప్‌" స్కీమ్‌ అంటే..?
స్టాక్‌ మార్కెట్‌లో "పంప్‌ & డంప్‌" స్కీమ్‌ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక కంపెనీ చేసే వ్యాపారం, ఆర్థిక పరిస్థితితో (ఫండమెంటల్స్‌) సంబంధం లేకుండా, స్టాక్‌ ధరను కృత్రిమంగా పెంచేలా చేసే మోసాన్నే  "పంప్‌ & డంప్‌" స్కీమ్‌ అంటారు. అంటే, ఒక పెన్నీ స్టాక్‌లో కొందరు వ్యక్తులు ముందుగా పెట్టుబడులు పెట్టి, ఆ తర్వాత దాని గురించి విపరీతమైన ప్రచారం చేస్తారు. ఉదాహరణకు, ఒక స్టాక్‌ను ఏ రూపాయికో, రెండు రూపాయలకో, 5 రూపాలయలకో ముందుగానే కొంటారు. ఆ తర్వాత దానిని ప్రమోట్ చేయడం ప్రారంభిస్తారు. దాని గురించి యూట్యూబ్‌ సహా ఇతర వెబ్‌సైట్స్‌లో విపరీతంగా యాడ్స్‌ ఇస్తారు. ఆ స్టాక్‌ ఏ రూ. 400 లేదా రూ. 500 వెళ్లిపోతుందని, ఇప్పుడు తక్కువ ధరలో ఉంది కొనుక్కోవచ్చంటూ ప్రకటనలు గుప్పిస్తారు. స్టాక్‌ మార్కెట్‌ యూట్యూబర్లు, రిపోర్టర్లకు కూడా డబ్బులు పంచి, ఆ స్టాక్‌ గురించి పాజిటివ్‌గా చెప్పిస్తారు. ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి తామే అందులో పెట్టుబడులు పెంచుతూ వెళతారు. దీంతో, కొన్ని రోజుల పాటు సదరు స్టాక్‌ ధర పెరుగుతూ వెళ్తుంది. ఈ ర్యాలీని చూసి, అమాయక లేదా అత్యాశపడే ఇన్వెస్టర్లు ఆ స్టాక్‌ను కొనడం ప్రారంభిస్తారు. దీంతో స్టాక్‌ ధర మరింత పెరుగుతుంది. అలా, ఒక స్థాయికి చేరిన తర్వాత ఆ స్టాక్‌ను మోసపూరిత పెట్టుబడిదార్లు అమ్మడం ప్రారంభిస్తారు, భారీ లాభాలు ఆర్జిస్తారు. అమాయక లేదా అత్యాశపడే ఇన్వెస్టర్లు ఆ వలలో చిక్కుకుని నష్టపోతారు.


అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టి, సాధ్నా బ్రాడ్‌కాస్ట్ కంపెనీ ప్రమోటర్లు, ఇతర వ్యక్తులు చేసింది ఈ "పంప్‌ & డంప్‌" మోసమే. సాధ్నా బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌, షార్ప్‌లైన్‌ బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌ కంపెనీల షేర్లను కొనుగోలు చేయండంటూ ఈ వ్యక్తులు యూట్యూబ్‌ వీడియోల ద్వారా మదుపర్లకు సిఫారసు చేసి వాటి ధరల్ని కృత్రిమంగా పెంచారని సెబీ తేల్చింది. 


2022 జులై నెలలో, సాధ్నా బ్రాడ్‌కాస్ట్ షేర్‌ ధర గురించి తప్పుదారి పట్టించే వీడియోలు "ది అడ్వైజర్" "మనీవైస్" అనే రెండు YouTube ఛానెల్‌ళ్లలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలు విడుదలైన తర్వాత, షేర్ ధర & వాల్యూమ్‌లో విపరీతమైన జంప్ కనిపించింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో చూసిన రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టారు. సాధ్నా బ్రాడ్‌కాస్ట్‌ ప్రమోటర్లకు కూడా ఈ మోసంలో భాగం ఉందని నిర్ధరించింది. 


"పంప్‌ & డంప్‌" స్కీమ్‌ ద్వారా అర్షద్ వార్సీ రూ. 29.43 లక్షలు, అతని భార్య మరియా రూ. 37.56 లక్షల లాభం తీసుకున్నారని, ఇక్బాల్‌ హుస్సేన్‌ వార్సి రూ. 9.34 లక్షలు సంపాదించారని సెబీ వెల్లడించింది.


తప్పుదారి పట్టించే వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా అక్రమంగా లాభపడినందుకు ఈ మోసగాళ్లందరికీ సెబీ రూ. 41.85 లక్షల జరిమానా విధించింది. వాళ్లు అక్రమంగా సంపాదించిన రూ. 54 కోట్ల లాభాలను కూడా స్వాధీనం చేసుకుంది.