SBI Rent Payment Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారుల కోసం ఒక బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. కార్డ్ ద్వారా చేసే రెంట్ పేమెంట్లు, EMIల మీద ఎక్స్‌ట్రా బాదాలని 'SBI Card' నిర్ణయించింది. నేటి నుంచి (నవంబర్ 15, 2022) ఇది అమల్లోకి కూడా వచ్చింది.
SBI క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు అద్దె చెల్లింపులు చేస్తే, ఇవాళ్టి నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. 'SBI కార్డ్' సంస్థ ఈ విషయాన్ని వివరిస్తూ కస్టమర్లకు మెసేజ్‌లు కూడా పంపింది. 'SBI Card' అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్‌ను జారీ చేసే సంస్థ. స్వతంత్రంగా వ్యవహరిస్తుంది.
99 రూపాయలు + GST
SBI Card క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులు చేస్తే, ప్రాసెసింగ్ ఫీజు రూపంలో 99 రూపాయలు అదనంగా చెల్లించాలి. మళ్లీ, ఈ 99 రూపాయల మీద 18 శాతం GSTని కూడా మనమే కట్టాలి. నవంబర్ 14 వరకు ఈ బాదుడు లేకుండా జనం రెంట్ పేమెంట్లు చేశారు.
EMIల మీదా బాదుడు
మర్చంట్ EMI లావాదేవీల ప్రాసెసింగ్ ఫీజులో కూడా SBI Card మార్పులు చేసింది. నవంబర్ 14 వరకు ఈ రుసుము రూ. 99గా ఉండేది. నవంబర్ 15 నుంచి మరో రూ. 100 పెంచింది. ఇప్పుడు, మర్చంట్ EMI లావాదేవీల ప్రాసెసింగ్ ఫీజు రూపంలో రూ. 199 కట్టాల్సిందే. ఇది ఇక్కడితోనే ఆగలేదు. దీని మీద 18 శాతం GST మిగిలే ఉంది. దానిని కూడా కలిపి సమర్పించుకోవాల్సి ఉంటుంది.
కొత్త రూల్ ఏంటి?
అన్ని రకాల SBI మర్చంట్ EMI లావాదేవీలకూ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. పాయింట్-ఆఫ్-సేల్ (PoS) మెషీన్ ద్వారా లేదా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో లావాదేవీలు చేసినా కొత్త రూల్ వర్తిస్తుంది. ఒక వస్తువును కొనే సమయంలోనే EMIలుగా మార్చుకున్నా, లేదా ముందుగా కొని ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ మొత్తాన్ని EMIలలోకి మార్చుకున్నా అదనపు బాడుదు భరించాలి.
ICICI బ్యాంకుదీ అదే దారి
ICICI బ్యాంక్ ఇప్పటికే ఛార్జీల మోత మోగిస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లిస్తున్న వాళ్ల నుంచి 1% ప్రాసెసింగ్ ఫీజు, దీని మీద GST వసూలు చేస్తోంది. అక్టోబర్ 20, 2022 నుంచి దీనిని అమల్లోకి తెచ్చింది. అంటే... Cred, RedGiraffe, MyGet, Paytm, Magicbricks వంటి థర్డ్ పార్టీల ద్వారా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి అద్దె చెల్లించే వారు ప్రత్యేకంగా 1% ఛార్జీని చెల్లించాలి.
సమయానికి చేతిలో డబ్బులు లేకపోయినప్పుడు, క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించే సౌలభ్యాన్ని ఇప్పటివరకు జనం వినియోగించుకున్నారు. ఆ డబ్బును సమకూర్చుకోవడానికి, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించే తేదీ వరకు సమయం చిక్కేది. ఇప్పుడు కూడా అదే సమయం అందుబాటులో ఉంటుంది గానీ, ప్రాసెసింగ్ ఫీజు & GST రూపంలో మరికొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.