Income Tax Update: మీ ఆదాయంలో పెద్ద మొత్తం ఆదాయపు పన్ను రూపంలో చేయి దాటి వెళ్లిపోతుంటే.., దానికి కళ్లెం వేసి, తిరిగి మన దగ్గరకే రప్పించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. పన్ను మినహాయింపు పొందే మార్గాల గురించి మీరు అవగాహన పెంచుకుంటే, చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. 


ఎంత ఆదాయం పన్ను రహితం?


అన్ని విషయాల్లో మొదటిది, సంవత్సరానికి రూ. 2.5 లక్షల ఆదాయం వరకు పన్ను రహితం. మీరు కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో పెట్టుబడి పెట్టడం పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇలా చేసినా పన్ను చెల్లించాల్సిన ఆదాయం మిగిలే ఉంటే, దానిని కూడా నివారించే మరికొన్ని విషయాలు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మేము మీకు అందించబోతున్నాం. ఈ విషయాలను తెలుసుకోవడం వల్ల మీరు ఎంత సేవ్ చేయగలరో మీకే అర్ధం అవుతుంది.


చాలామందికి తెలీని రూల్స్‌ 


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో (PPF) సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బు పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. పైగా, ఈ పెట్టుబడి మీద మీరు వడ్డీని పొందుతారు.


సహజ పదవీ విరమణ కంటే ముందే స్వచ్ఛంద పదవీ విరమణ పొందే అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది. దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు ముందే చేతికి వస్తుంది. దీనిలో 5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.


ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(2) ప్రకారం, హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) లేదా వారసత్వంగా పొందిన డబ్బు పూర్తిగా పన్ను రహితం. ఆదాయపు పన్ను విషయంలో మీరు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.


మీరు వ్యవసాయ వ్యాపారం చేస్తుంటే, అంటే, వ్యవసాయం ద్వారా మీరు సంపాదించే ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది.


ఒక సంస్థలో భాగస్వామి ఉంటూ మీరు స్వీకరించే ఆదాయం మొత్తానికి పన్ను ఉండదు. కంపెనీ అప్పటికే దాని మీద పన్ను చెల్లించినందున, లాభాల మీద మాత్రమే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


మీరు ఉద్యోగి అయితే, మొదట 'పే రూల్స్‌'ను అర్థం చేసుకోండి. ఒక కంపెనీలో 5 సంవత్సరాల సర్వీసు తర్వాత గ్రాట్యుటీ వస్తుంది. ఈ గ్రాట్యుటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం. ఈ పన్ను రహిత మొత్తానికి పరిమితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగి అందుకునే గ్రాట్యుటీలో రూ. 20 లక్షల మొత్తం వరకు పన్ను విధించరు, ఈ మొత్తం దాటితే ఆదాయ పన్ను చెల్లించాలి. అదే విధంగా, ప్రైవేట్ ఉద్యోగి సంపాదించిన గ్రాట్యుటీలో రూ. 10 లక్షల వరకు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు, ఆ మొత్తం దాటితేనే పన్ను కట్టాలి.


పన్ను ఎగవేత గురించి ఇక్కడ మేం చెప్పడం లేదు, పన్ను ఆదా గురించి మాత్రమే చెబుతున్నామన్న విషయం మీరు గుర్తుంచుకోండి. ఆదాయ పన్ను ఎగవేత చట్ట ప్రకారం నేరం. మీరు ఎంత ప్రయత్నించినా, ఆదాయంలో కొంత మొత్తానికి పన్ను కట్టడం తప్పనిసరి అవుతుంది.