Samvat 2078 Recap: ఈ నెల 24 నుంచి హిందూ నూతన సంవత్సరం సంవత్ 2079 ప్రారంభమవుతుంది. దీపావళి నుంచి దీపావళి వరకు ఉన్న కాలాన్ని హిందూ సంవత్సరంగా భావిస్తారు.  సంవత్ 2079లో అదృష్టాన్ని తెచ్చిపెడతాయంటూ టాప్‌ బ్రోకరేజ్‌లు చాలా స్టాక్స్‌ను రికమెండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో... సంవత్ 2078 ఎలా గడిచింది, దలాల్‌ స్ట్రీట్‌లో జరిగిన మంచి-చెడులేంటి? ఇప్పుడు చూద్దాం. 


సంవత్ 2078 పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమైంది. కానీ, సంవత్సరంలో భారీ అస్థిరతను తెచ్చిపెట్టింది. ఫలితంగా దలాల్ స్ట్రీట్ ప్రతికూల రాబడిని పంచుకోవాల్సి వచ్చింది. ఈ కాలంలో బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ 50 & సెన్సెక్స్ 1% కంటే ఎక్కువే పడిపోయాయి.


ఇంటర్నేషనల్‌ ఫ్యాక్టర్స్‌
ఒమిక్రాన్ వేరియంట్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ (యూఎస్‌ ఫెడ్‌) సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు దూకుడుగా వడ్డీ రేట్ల పెంచడం వంటివి ప్రపంచవ్యాప్తంగా వృద్ధిని దెబ్బతీశాయి, ఎద్దులకు ముకుతాడు వేశాయి.


ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ మీద రష్యా చేసిన దాడి తర్వాత ముడి చమురు, ఇతర కమొడిటీల ధరలు ఆకాశంలోకి చేరాయి. దీంతో, దశాబ్దాల గరిష్టానికి ద్రవ్యోల్బణం పెరిగింది. దీనివల్లే యూఎస్‌ ఫెడ్, ఇతర సెంట్రల్ బ్యాంకులు దూకుడుగా ఉండవలసి వచ్చింది.


మహమ్మారి వచ్చిన సరిగ్గా రెండేళ్ల తర్వాత, ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడం ద్వారా US ఫెడ్ తన కఠిన విధానాన్ని ప్రారంభించింది. మార్చి నుంచి ఇప్పటివరకు భారీగా 300 bps రేటు పెంచింది. ఈ ఏడాది చివరి నాటికి మరో 125 bps పెంపు గురించి ఆలోచిస్తోంది.


ఫెడ్ అడుగుజాడల్లో నడిచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఈ ఏడాది మే నెల నుంచి వడ్డీ రేట్లను కఠినతరం చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు  రెపో రేటును 190 bps పెంచింది.


ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, వడ్డీ రేట్ల పెంపులో వేగం కారణంగా.. US 10-ఇయర్‌ బాండ్ ఈల్డ్స్‌ విపరీతంగా పెరిగాయి, ప్రస్తుతం 4%పైకి చేరాయి. డాలర్ ఇండెక్స్ మల్టీ-డికేడ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది, సెప్టెంబర్‌లో రెండు దశాబ్దాల గరిష్ట స్థాయి 114.77 పాయింట్లను తాకింది. డాలర్‌ దెబ్బకు ఇండియన్‌ రూపాయి కుదేలైంది. బుధవారం 83 మార్కును అధిగమించి రికార్డు కనిష్ట స్థాయి 83.02 వద్ద ముగిసింది.


నేషనల్‌ ఫ్యాక్టర్స్
స్థూల ఆర్థిక ప్రతికూల గాలుల నుంచి రక్షణ కోసం పరుగులు పెట్టిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) ఈక్విటీల నుంచి తమ పెట్టుబడులు వెనక్కు తీసుకుని, హెవెన్‌ అసెట్స్‌లో (రక్షణాత్మక పెట్టుబడులు) షెల్టర్‌ పొందారు. 


2021 నవంబర్ నుంచి (సంవత్ 2078 ప్రారంభమైనప్పటి నుంచి) FIIలు దాదాపు $27 బిలియన్ల విలువైన ఇండియన్‌ ఈక్విటీలను నికరంగా విక్రయించారు. 2022లో ఇప్పటివరకు $24 బిలియన్లకు పైగా నెట్‌ ఔట్‌ఫ్లోస్‌ ఉన్నాయి. ఇది రికార్డ్‌ స్థాయి.


సంవత్ 2078లో ఎద్దులు (DIIలు) - ఎలుగుబంట్ల (FIIలు) మధ్య జరిగిన "టగ్ ఆఫ్ వార్‌"లో ఎలుగుబంట్ల బలమే గెలిచింది. అయితే, ఎద్దులు మరీ బలహీనపడలేదు. ఈక్విటీలు మట్టిగొట్టుకుని పోకుండా గట్టిగా అడ్డుకున్నాయి.


సంవత్ 2078లో.. చాలా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందిన మార్కెట్లు రెండంకెల పతనాన్ని చూసినా, ఇండియన్‌ బెంచ్‌మార్క్ సూచీల్లో కేవలం 1% పతనం కావడంలో ఎద్దుల బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సంవత్సరానికి సంబంధించి, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి (Kospi) ఇండెక్స్ 25% క్షీణించింది. అమెరికాకు చెందిన డౌ జోన్స్ (Dow Jones) 16% పైగా తగ్గింది.


FIIలు ఎగ్జిట్ మోడ్‌లో ఉన్నప్పుడు దేశీయ పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయల డబ్బును ఈక్విటీల్లోకి పంప్‌ చేయడంలో భారతదేశ వృద్ధి పథంపై వాళ్లకున్న నమ్మకం కనిపిస్తోంది.


2021 నవంబర్ నుంచి DIIలు రికార్డు స్థాయిలో రూ. 2.1 లక్షల కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు.


ఈ సంవత్సరంలో అనేక లార్జ్‌ క్యాప్ స్టాక్స్‌ వెనుకబడి ఉన్నాయి. అయితే, స్మాల్‌ క్యాప్ స్పేస్‌లో అనేక మల్టీబ్యాగర్లు పుట్టుకొచ్చాయి.


గ్లోబల్ షాక్‌లను తట్టుకున్న ఇండియన్ ఈక్విటీల గట్టిదనాన్ని దృష్టిలో పెట్టుకుని, మార్కెట్ నిపుణులు విక్రమ్ సంవత్ 2079 మంచి రోజులను తెచ్చిపెడుతుందని, సెన్సెక్స్ & నిఫ్టీ50లు కొత్త గరిష్టాలకు వెళ్లవచ్చని విశ్వసిస్తున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.