Keystone Realtors shares: కీస్టోన్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు ఇవాళ (బుధవారం, 24 నవంబర్‌ 2022) స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ అయ్యాయి. ఈ షేర్లకు పెట్టుబడిదారుల నుంచి స్పందన పెద్దగా కనిపించలేదు. 


NSEలో ఒక్కో షేరు ₹555 వద్ద లిస్ట్‌ అయింది. IPO ఇష్యూ ధర ₹541తో పోలిస్తే ఇది కేవలం 2% ప్రీమియం. BSEలోలోనూ ఒక్కో షేరు ₹555 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి.


కీస్టోన్‌ రియల్టర్స్‌ IPO వివరాలు
కీస్టోన్ రియల్టర్స్ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) నవంబర్ 14న ప్రారంభమై 16వ తేదీన ముగిసింది. ఈ పబ్లిక్‌ ఇష్యూకి అంతతమాత్రపు స్పందన లభించింది. 2 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. NSE లెక్కల ప్రకారం... 86,47,858 షేర్లను కంపెనీ ఆఫర్‌ చేయగా.. 1,73,72,367 షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ (QIBs) నుంచి 3.84 రెట్లు, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌ (NIIs) నుంచి 3.03 రెట్లు అధికంగా బిడ్స్‌ వచ్చాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం 53% మాత్రమే రెస్పాన్స్‌ అందుకుంది. విన్నింగ్‌ బిడ్డర్స్‌కు  నవంబర్ 21న షేర్లను కేటాయించారు.


IPOలో, ఒక్కో షేరుకు రూ. 514–541 రేంజ్‌లో ధర నిర్ణయించారు. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 635 కోట్లు సమీకరించింది. IPOకు ఒకరోజు ముందు జరిగిన యాంకర్‌ ఇన్వెస్టర్ల రౌండ్‌లో రూ. 190 కోట్ల కూడగట్టింది. 16 యాంకర్ ఇన్వెస్టర్లకు, ఒక్కో షేర్‌ను రూ. 541 రూపాయల చొప్పున 35.21 లక్షల ఈక్విటీ షేర్లు కేటాయించింది. షేర్లు కొన్న ఇన్వెస్టర్ల జాబితాలో... అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, మోర్గన్ స్టాన్లీ, సెయింట్ కేపిటల్, ఆదిత్య బిర్లా మ్యూచ్యువల్ ఫండ్, IDFC మ్యూచ్యువల్ ఫండ్, టాటా మ్యూచ్యువల్ ఫండ్ , క్వాంట్ మ్యూచ్యువల్ ఫండ్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. 


IPO ద్వారా వచ్చిన డబ్బులో దాదాపు రూ. 342 కోట్లను అప్పుల తీర్చడానికి, భవిష్యత్‌ స్థిరాస్తి ప్రాజెక్టుల కోసం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 


కీస్టోన్‌ రియల్టర్స్‌ వ్యాపారం
రుస్తోమ్ జీ గ్రూప్‌ కంపెనీ ఇది. 1995లో ఏర్పాటైంది. 'రుస్తోమ్‌జీ' బ్రాండ్‌తో స్థిరాస్తి వ్యాపారం చేస్తోంది. ఇప్పటి వరకు 32 ప్రాజెక్టులు పూర్తి చేసింది. ప్రస్తుతం 12 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో (MMR) మరో 19 ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు కీస్టోన్‌ రియల్టర్స్‌ వెల్లడించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.