Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయమై మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే తమ అధికారిని మంత్రి బంధించారని ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. అలాగే తాము సేకరించిన డాక్యుమెంట్లను మంత్రి మల్లారెడ్డి చించి పడేశారని, తమ ల్యాప్ టాప్ ను కూడా బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ అధికారులు తమపై దాడి చేసి బలవంతంగా తప్పుడు లెక్కలతో తమ సంతకం తీసుకున్నారని మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కూడా కొట్టినట్లు చెబుతున్నారు. ఐటీ శాఖ అధికారులు చేసిన ఫిర్యాదును దుండిగల్ పోలీస్ స్టేషన్ కు అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. 


మరోవైపు మల్లారెడ్డికి చెందిన ఆఫీస్‌లు, ఇళ్లలు, బంధువులు, రక్తసంబంధీకుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు ముగిశాయి. తనిఖీల్లో దొరికిన నగదు, ఇతర ఆస్తులపై వివరణ ఇచ్చేందుకు ఐటీ కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చింది. మంత్రి మల్లారెడ్డితోపాటు ఇద్దరు కుమారులు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డికి ఐటీ శాఖ నోటీసులు అందజేసింది. సోమవారం ఐటీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది.


అసలేం జరిగిందంటే..?


తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగాయని  ఐటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చించినట్టు అధికారులు గుర్తించారు.  


65 బృందాలు సోదాలు.. 


రెండు రోజులుగా జరుగుతున్న సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది  65 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు.  కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల రాత్రికి ముగిసే అవకాశముందని, ఇంకొన్ని చోట్ల రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలుస్తోంది. 


భారీగా నగదు స్వాధీనం..


మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఐటీ సోదాల్లో రూ.4 కోట్ల 80 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్ల 80 లక్షలు, మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఇంటిలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మల్లారెడ్డి బామ్మర్ది కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐటీ శాఖ అధికారులు ఈ విషయం మీద స్పందిస్తూ మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు.  ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గురువారం నాటికి సోదాలు ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది.