Rupee Vs Dollar: రూపాయికి మళ్లీ మంచి రోజులు వచ్చినట్టున్నాయి! డాలర్‌తో పోలిస్తే నేడు మరింత బలపడింది. మంగళవారం రికార్డు స్థాయిలో పెరిగింది. ఏడాదిలో ఒకరోజు అత్యధిక లాభాలను నమోదు చేసింది. భారత స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు తిరిగి వస్తుండటంతో నేడు 51 పైసలు పెరిగి రూ.79.45 వద్ద ముగిసింది. 2021, ఆగస్టు 27 తర్వాత ఒక్క రోజులో గరిష్ఠ పెరుగుదల ఇదే కావడం గమనార్హం.


ద్రవ్యోల్బణం పెరుగుదల, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా డాలర్లకు గిరాకీ పెరగడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైంది. ఏడాది క్రితం రూ.74-75 స్థాయిల్లో ఉన్న విలువ కొన్ని రోజుల క్రితం ఆల్‌టైమ్‌ కనిష్ఠమైన రూ.80.12కు చేరుకుంది. మళ్లీ అదే రోజు కాస్త పుంజుకొని రూ.79.96 వద్ద ముగిసింది.


రెండు రోజుల్లో విపరీతంగా నష్టపోయిన స్టాక్‌ మార్కెట్లు మంగళవారం అదరగొట్టాయి. ఇన్వెస్టర్లు డిప్స్‌లో కొనుగోళ్లు చేపట్టడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఏకంగా 2.7 శాతం పెరిగింది. అంతేకాకుండా విదేశీ సంస్థాగత పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ఆగస్టులోనే 6 బిలియన్‌ డాలర్ల మేర ఎఫ్‌ఐఐలు ఇండియన్‌ ఈక్విటీల్లో కొనుగోళ్లు చేపట్టారు. 2020 డిసెంబర్‌ తర్వాత ఇదే అత్యధిక కొనుగోళ్లు కావడం ప్రత్యేకం.


విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వ బాండ్లనూ కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో వారు నెట్‌ బయ్యర్లుగా అవతరించడం ఆగస్టులోనే తొలిసారి. ఇదే సమయంలో పదేళ్ల బాండ్‌ యీల్డులు 6 బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.1893 శాతంగా ఉండటం గమనార్హం.


కమోడిటీ ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో రూపాయి విలువ మరింత పెరుగుతుందని హెచ్‌ఎస్‌బీసీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ సైతం అండగా నిలవడం ఇందుకు దోహదం చేస్తోందని పేర్కొన్నారు. 'డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత బలపడుతుంది. తాత్కాలికంగా కొన్ని అంశాల్లో లోటు ఉన్నా రూపాయి మెరుగ్గా ఉంటుంది' అని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది.


ప్రస్తుతం రూపాయి విలువ పెరుగుతున్నా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు రాకుండా ఉండేందుకు వడ్డీరేట్లు మరింత పెంచుతామని యూఎస్ ఫెడ్‌ స్పష్టం చేయడంతో ఒడుదొడుకులు కొనసాగుతాయని అంచనా వేశారు. 'అంతర్జాతీయ పరిస్థితులతో జపాన్‌ యెన్‌, చైనా యువాన్ భారీగా పతనమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయిని రక్షించడంలో ఆర్బీఐ ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి' అని సీఆర్‌ ఫారెక్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ అమిత్‌ పబారీ పేర్కొన్నారు.


Stock Market Closing Bell 30 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. తొలి త్రైమాసికంలో జీడీపీ పెరుగుదల, ఆర్థికాభివృద్ధి, ఆటో స్టాక్స్‌ జోరుమీద ఉండటం, ఐరోపాలో పరిస్థితులు మెరుగవుతున్నాయన్న సూచనలతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 446 పాయింట్ల లాభంతో 17,759 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1564 పాయింట్ల లాభంతో 59,537 వద్ద ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు పెరిగింది.