State Bank of India: మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అతి పెద్దది. మారుమూల తండాల నుంచి మెట్రో సిటీల వరకు, దేశవ్యాప్తంగా ఈ బ్యాంక్‌కు కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. బ్యాంక్‌ సేవలు, క్రెడిట్‌ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ నిర్వహణ ఛార్జీలు, ఖాతా నిర్వహణ ఛార్జీలు, ATM నిర్వహణ ఛార్జీలు, ఖాతాలో కనీస నిల్వ లేకపోవడం మీద పెనాల్టీ, ఓవర్‌ డ్రాఫ్ట్‌ మీద వడ్డీ, అన్ని రకాల సేవల మీద గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ (GST) ఇలా రకరకాల పేర్లతో మన ఖాతాల నుండి స్టేట్‌ బ్యాంక్‌ డబ్బులు ఉపసంహరించుకుంటుంది. నిర్దిష్ట కాల వ్యవధిలో డబ్బులు కట్‌ చేస్తుంది. 


మన ఖాతా నుంచి డబ్బులు డెబిట్‌ అయిన విషయం కొన్నిసార్లు మన రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ రూపంలో వస్తుంది. మరి కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా. మెసేజ్‌ రాని సందర్భాల్లో.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌, లావాదేవీలను చెక్‌ చేసుకున్నప్పుడు మాత్రమే డబ్బు కట్‌ అయిందన్న సంగతి మనకు తెలుస్తుంది. అప్పుడు కూడా, ఆ డబ్బు ఎప్పుడు, ఎందుకు ఖర్చు పెట్టామో గుర్తు రాక కస్టమర్లు జుట్టు పీక్కుంటుంటారు. కొంతమంది బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి, లేదా నేరుగా బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి ఈ డబ్బు ఎందుకు కట్‌ అయిందో తెలుసుకుంటుంటారు. మిగిలినవాళ్లకు ఆ సందేహం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది.


బ్యాంకులు, తమ ఖాతాదారులు ఎంచుకున్న కార్డ్ రకం, లావాదేవీల సంఖ్య ఆధారంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఛార్జీలను విధిస్తాయి.


ఖాతా నుంచి రూ.147.5 కట్‌ అయితే ఏమిటి అర్ధం?
మీరు ఖర్చు చేయకుండానే మీ స్టేట్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 147.5 డెబిట్ అయినట్లు ఎప్పుడైనా మీరు గమనిస్తే, అది బ్యాంక్‌ పనేనని అర్ధం చేసుకోండి. మీరు ఉపయోగించే డెబిట్ లేదా ATM కార్డ్ కోసం వార్షిక నిర్వహణ లేదా సేవా రుసుము కింద ఆ మొత్తం మీ ఖాతా నుండి బ్యాంక్‌ తీసుకుంటుంది. SBI తన కస్టమర్లకు చాలా రకాల డెబిట్ కార్డ్‌లను అందిస్తుంది. వాటిలో చాలా వరకు క్లాసిక్/సిల్వర్/కాంటాక్ట్‌లెస్/గ్లోబల్ డెబిట్ కార్డ్‌లు ఉన్నాయి. ఈ కార్డుల కోసం వార్షిక నిర్వహణ రుసుముగా (యాన్యువల్‌ మెయింటెనెన్స్‌ ఛార్జెస్‌) బ్యాంకు రూ. 125 వసూలు చేస్తుంది. ఈ రూ. 125 ఛార్జ్‌ మీద మళ్లీ సేవా రుసుము రూపంలో 18 శాతం GST వర్తింపజేస్తుంది. ఆ GST మొత్తం రూ. 22.5 అవుతుంది. అసలు ఛార్జ్‌ రూ. 125, GST రూ. 22.5ని కలిపి మీ ఖాతా నుంచి మొత్తం రూ. 147.5 వెనక్కు తీసుకుంటుంది. 


ఒకవేళ మీరు మీ డెబిట్ కార్డ్‌ని మార్చి, మరొకటి తీసుకోవాలని అనుకుంటే, ఆ సర్వీస్ కోసం రూ. 300+GSTని బ్యాంక్‌ విధిస్తుంది.


దేశీయ, అంతర్జాతీయ, కో-బ్రాండెడ్ కార్డ్‌లు వంటి అనేక రకాల డెబిట్ కార్డ్‌లను SBI అందిస్తోంది. మీరు మీ ఖర్చు అవసరాల ఆధారంగా SBI డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. SBI అందించే అన్ని డెబిట్ కార్డ్‌లు ఆటోమేటిక్‌గా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉంటాయి. మీరు మీ డెబిట్ కార్డ్ ద్వారా ఒక లావాదేవీ చేసినప్పుడు, డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్‌ అవుతుంది.