Stock market crash Rs 10 lakh cr market cap wiped out:   భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా పతనమయింది.  నిఫ్టీ కీలకమైన 25,500 స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ఉదయం ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించగా, ముగిసే సమయానికి ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ పదిలక్షల కోట్ల మేర తగ్గిపోయింది.  అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, బలహీనమైన గ్లోబల్ సంకేతాలు మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.

Continues below advertisement

ఈ పతనానికి ప్రధానంగా ఎనిమిది కీలక కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లలో భయాందోళనలు రేకెత్తించాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ మొదలవ్వడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్లు  భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు.             

మరోవైపు, దేశీయంగా ఐటి, బ్యాంకింగ్ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణం. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. రక్షణ రంగం మరియు మెటల్ షేర్లు కూడా ఈ పతనంలో కీలక పాత్ర పోషించాయి.                      

చిన్న మరియు మధ్య తరహా షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. మార్కెట్ మరింత పడిపోయే అవకాశం ఉందన్న భయంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు  మొగ్గు చూపారు. రాబోయే రోజుల్లో ఆర్బీఐ తీసుకోబోయే నిర్ణయాలు , అంతర్జాతీయ పరిణామాలపైనే మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మార్కెట్ అస్థిరంగా ఉన్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.