Jogi Ramesh get bail in fake liquor case: నకిలీ మద్యం కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు విజయవాడ కోర్టులో ఊరట లభించింది. భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం వీరికి బెయిల్ మంజూరు చేసింది. గతంలో పలుమార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైనప్పటికీ, ప్రస్తుత విచారణలో భాగంగా కోర్టు వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం
గత ఏప్రిల్‌లో ఉమ్మడి కడప జిల్లా ములకల చెరువు..ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్ధన్ రావు వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జోగి రమేష్ ఆదేశాల మేరకే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు నిందితుడు ఆరోపించడంతో, ప్రత్యేక విచారణ బృందం జోగి సోదరులను నవంబర్ నెలలో అరెస్ట్ చేసింది. అద్దేపల్లి జనార్ధన్ రావు ఎవరో తనకు తెలియదని జోగి రమేష్ వాదించారు. అయితే అద్దేపల్లితో జోగి రమేష్ జరిపిన ఆర్థిక లావాదేవీలతో సహా మొత్‌తం బయటకు తీసి పోలీసులు చార్జిషీటు నమోదు చేసారు.
ములకల చెరువుకేసులో ఇంకా లభించని బెయిల్
భవానీపురం కేసులో బెయిల్ లభించినప్పటికీ, జోగి రమేష్‌కు పూర్తిస్థాయిలో విడుదల లభించలేదు. అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో నమోదైన మరొక నకిలీ మద్యం కేసులో ఆయన ఇంకా రిమాండ్‌లోనే ఉన్నారు. ఆ కేసులో బెయిల్ పిటిషన్ ప్రస్తుతం తంబళ్లపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై విచారణ పూర్తై అక్కడ కూడా బెయిల్ వస్తేనే ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
రెండో కేసులోనూ బెయిల్ వచ్చాక విడుదల
ఈ అరెస్టులు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యలని జోగి రమేష్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని వారు వాదిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న జోగి సోదరులు, తదుపరి న్యాయ పోరాటం ద్వారా మొలకలచెరువు కేసులో కూడా బెయిల్ పొందేందుకు ప్రయత్నాలు చేయనున్నారు.