Prevent Foaming in a Pressure Cooker : ప్రెజర్ కుక్కర్‌లో వంట చేస్తే సమయం ఆదా అవుతుంది. బిజీగా ఉండే రోజుల్లో ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. పదే పదే వంటకాన్ని చూడాల్సిన అవసరం కూడా లేకుండా చేస్తుంది. కానీ పప్పు, బీన్స్ లేదా బియ్యం ఉడికించేటప్పుడు.. కుక్కర్ విజిల్ వేసిన వెంటనే నురగ బయటకు వస్తుంది. ఈ పదార్ధాలలో ఉండే స్టార్చ్ కారణంగా ఇది జరుగుతుంది. దీని కారణంగా అవి ఉడికేప్పుడు నురుగు ఏర్పడుతుంది. దీనివల్ల అది మూత లేదా విజిల్ నుంచి బయటకు రావడం ప్రారంభిస్తుంది. ఇది స్టౌవ్, వంటగదిని మురికి చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నురుగు ఎందుకు వస్తుందంటే..
వాస్తవానికి ఇది ఈ ఆహార పదార్థాలలో ఉన్న స్టార్చ్ కారణంగా జరుగుతుంది. ఉడికేటప్పుడు స్టార్చ్ నీటితో కలిసి నురుగును ఏర్పరుస్తుంది. ఇది ఆవిరి ఒత్తిడితో బయటకు రావడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా పప్పు పెట్టినప్పుడు దాని నుంచి నురుగు, నీరు గ్యాస్ పడిపోతుంది. దీనివల్ల వంట చేయడం సులభమే అయినా క్లీనింగ్ ఎక్స్ట్రా పనిగా మారుతుంది. ఈ సమస్య గురించి మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన, ఇంటి చిట్కాలను ఫాలో అవుతూ.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
కుక్కర్ నుంచి నురుగు రాకుండా ఎలా ఆపాలంటే
పప్పు, బీన్స్ లేదా బియ్యం ఉడికించేటప్పుడు నురుగు బయటకు రావడం సర్వసాధారణం. దీన్ని నివారించడానికి.. కొన్ని చిట్కాలు ఫాలో అవ్వవచ్చు.
- నూనె లేదా నెయ్యి వేయాలి
కుక్కర్‌లో పప్పు లేదా ఇతర పదార్థాలను వేసిన తర్వాత ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి కలపాలని గుర్తుంచుకోండి. ఇది నురుగు ఏర్పడే ప్రక్రియను విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల నురుగు బయటకు రాదు. అలాగే కుక్కర్‌ను ఎప్పుడూ అవసరమైన దానికంటే ఎక్కువ నీటితో నింపకూడదని గుర్తుంచుకోండి. ముఖ్యంగా పప్పు లేదా బీన్స్ ఉడికించేటప్పుడు.. కుక్కర్‌ను సగానికి మించి నింపవద్దు. దీనివల్ల ఉడికేప్పుడు పదార్థాలు వ్యాప్తి చెందడానికి తగినంత స్థలం ఉంటుంది.
- స్టీల్ స్పూన్ ట్రిక్
నూనె లేదా నెయ్యి వేయకూడదనుకుంటే.. మరొక సులభమైన ట్రిక్ కూడా ఉంది. ఈ పద్ధతిని ఫుడ్ బ్లాగర్, కంటెంట్ క్రియేటర్ నీతికా నిగ్గా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుక్కర్‌ను మూసే ముందు.. ఒక శుభ్రమైన స్టీల్ స్పూన్‌ను లోపల ఉంచాలని ఆమె చెప్పారు. ఈ స్పూన్ మరిగేటప్పుడు ఏర్పడే బుడగలను విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల నురుగు నియంత్రణలో ఉంటుంది. విజిల్ లేదా మూత నుంచి నురుగు బయటకు రాకుండా ఉంటుంది.
ఈ సులభమైన మార్గాలను అనుసరించడం ద్వారా మీరు దాదాపు 90 శాతం వరకు నురుగు వచ్చే సమస్యను నివారించవచ్చు. ఇది వంటగదిని శుభ్రంగా ఉంచడమే కాకుండా.. వంటను మరింత సులభతరం చేస్తుంది.