Robert Kiyosaki: ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో చాలా మందికి పరిచయం అక్కర్లేని పేరు రాబర్ట్ కియోసాకి. ఆయన తను రచించించిన పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' చాలా మందిని మెప్పించింది. అందరికంటే భిన్నంగా ఆలోచించటంలో రాబర్ట్ ఎల్లప్పుడూ ముందుంటారని మరోసారి తాజా కామెంట్స్ ద్వారా వెల్లడైంది.
సామాన్యులు సైతం త్వరగా ధనవంతులు కావటానికి తరచుగా స్టాక్ మార్కెట్లు, బాండ్స్, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులను ఎక్కువగా నమ్ముకుంటుంటారు. అయితే వీటికి పూర్తి భిన్నంగా రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం బిట్‌కాయిన్, బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో బిట్ కాయిన్ ధర గణనీయంగా పెరగనుందని రాబర్ట్ కియోసాకి అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 2025 నాటికి బిట్‌కాయిన్ ధరలు దాని ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఆగస్ట్ 2024 నాటికి బిట్‌కాయిన్ $350,000కి చేరుకోవచ్చని అంచనా వేయబడింది.
కియోసాకి అంచనా ప్రకారం బిట్‌కాయిన్ ధర కేవలం మూడు నెలల్లో 5 రెట్లు పెరుగుతుందని వెల్లడైంది. బిట్‌కాయిన్ ప్రస్తుత ధర $70,654.44 నుంచి 5 రెట్లు పెరుగుతుందని, ఆగస్టు 2024లో $3,50,000కి చేరుతుందని రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. తన అంచనాలకు అనుగుణంగా మరిన్ని బిట్‌కాయిన్, ఎథెరియం, సోలానాను కొనుగోలు చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. ఎందుకంటే వాటి ధరలు పెరుగుతూనే ఉంటాయని తాను ఖచ్చితంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి, బిట్‌కాయిన్, సోలానా, ఎథెరియం కొనాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు.
కియోసాకి గతంలో బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టమని సలహా ఇచ్చేవారు. ముఖ్యంగా వెండికి సంబంధించి, కియోసాకి గత సంవత్సరం ఒక పోస్ట్‌లో చెప్పినట్లుగా ప్రజలు వీలైనంత ఎక్కువగా వెండిని కొనండి అని సూచించారు. ధనవంతులు కావాలనే మీ కల నెరవేరాలంటే వెండి కొనండి అని తన పోస్ట్‌లో రాశారు. ఇటీవలి కాలంలో అనేక కారణాలతో విపరీతంగా పెరిగిన వెండి, పసిడి ధరలను చూస్తున్న చాలా మంది ఇన్వెస్టర్లు కియోసాకి అంచనాలు నిజమయ్యాయని అంటున్నారు.
3-5 ఏళ్ల పాటు వెండి ధర 20 డాలర్లుగా ఉంటుందని, రానున్న కాలంలో 100 డాలర్ల నుంచి 500 డాలర్లకు చేరుకోవచ్చని కియోసాకి అంచనా వేశారు. కియోసాకి ప్రకారం ఎక్కువగా డబ్బులేని వ్యక్తులు సైతం వెండిని కొనటం ద్వారా ధనవంతులుగా మారవచ్చని సూచిస్తున్నారు. కియోసాకి కామెంట్స్ ప్రస్తుతం భారతీయ పసిడి, వెండి ప్రియులను ఆలోచనలో పడేస్తున్నాయి. ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతున్నప్పటికీ గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేయాలని వారిని పురిగొల్పుతున్నాయి.
NOTE: పైన అందించిన వివరాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోకండి. బంగారం, వెండి, బిట్‌కాయిన్, క్రిప్టో మార్కెట్, షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ ఉంటుంది. దీని వల్ల ప్రయోజనంతోపాటు నష్టాలు సైతం అధికంగా ఉండే ప్రమాదం ఉంది. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీ నష్టాలకు ఏబీపీ దేశం ఎలాంటి బాధ్యత వహించదు.