ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తాను చదువుకున్న కాలేజీ పట్ల విధేయత చాటుకున్నారు. ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కాలేజీకి రూ.151 కోట్ల గ్రాంట్ అందిస్తున్నట్లు ప్రకటించారు. 

1970లలో తాను గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. ‘పద్మవిభూషణ్’ ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర 'డివైన్ సైంటిస్ట్' పుస్తకావిష్కరణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎదుగుదలకు తన కాలేజీ, ప్రొఫెసర్ ఎంఎం శర్మ పోషించిన పాత్రను ఆయన గుర్తుచేసుకున్నారు. 

ప్రొఫెసర్ శర్మ గైడెన్స్‌తో రిలయన్స్ విలువ ఎంతో పెరిగింది. ఇయన ఇచ్చిన సూచనలతో వేస్టేజ్ అనేది లేకుండా కంపెనీని నిర్వహించడం గురించి తెలుసుకున్నాను. ఆయన ఆలోచనల ద్వారానే ముడి చమురు, PTA నుండి PET బాటిల్ వరకు, కాంపా కోలా వరకు మిలియన్ల భారతీయుల ఇండ్లకు మేం చేరుకున్నాము.

నా తండ్రి ధీరూభాయ్ అంబానీ లాగే, ప్రొఫెసర్ ఎంఎం శర్మ సైతం భారతీయ పరిశ్రమను కొరత నుంచి బయటపడి.. ప్రపంచానికి నాయకత్వం వహించాలనే బలమైన కోరిక ఉండేది. ధీరూబాయ్ లాగే ప్రొఫెసర్ శర్మకు భారత్‌ అగ్రస్థానంలో నిలవాలనే బర్నింగ్ డిజైర్ ఉండేది. ఆయనకు, నా తండ్రికి మధ్య జరిగిన అన్ని సమావేశాలలో నేను కూడా పాల్గొన్నాను. ఈ ఇద్దరు ధైర్యవంతులు, దార్శనికులు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రైవేట్ వ్యవస్థాపకత జత కలిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ప్రజలకు మేలు కలుగుతుందని నమ్మారు. భారతదేశం చాలా బిగ్ థింకింగ్‌తో ప్రపంచ స్థాయి తయారీ సంస్థలను నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని వారిద్దరూ ఆరోజుల్లోనే చెప్పారని’ ముఖేష్ అంబానీ గుర్తుచేసుకున్నారు.

విద్యార్థిగా వచ్చిన సమయంలో, అది ICT (ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) కాదు, అది UDCT (యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ). కానీ IIT బాంబే కాదని నేను UDCTని గ్రాడ్యుయేషన్ కోసం ఎంచుకున్నాను. ప్రొఫెసర్ శర్మ తొలి స్పీచ్ నాకు ఈరోజుకు కూడా గుర్తుంది. ఆయన మాటలు విన్న తర్వాత, నా నిర్ణయం సరైనదని నమ్మకం కలిగింది అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అన్నారు.