Relief to Reliance industries: దేశంలో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు దిల్లీ హైకోర్టు పెద్ద ఊరట ఇచ్చింది. కృష్ణా-గోదావరి బేసిన్ (KG Basin) రెండో బ్లాక్‌లోని గ్యాస్ విషయంలో ఈ ఉపశమనం లభించింది.
మోసం, దొంగతనం ఆరోపణలు కొట్టివేత
రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలు రెండో బ్లాక్‌లోని 1.729 బిలియన్ డాలర్ల విలువైన గ్యాస్‌ను మోసపూరితంగా తీసుకున్నాయని, దొంగిలించాయని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. రెండో బ్లాక్‌లోని గ్యాస్ నిక్షేపాలను విక్రయించే హక్కు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు లేదని ప్రభుత్వం వాదించగా, ఈ వాదనను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
2018 జులై 24న, రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలోని కన్సార్టియంకు అనుకూలంగా వచ్చిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్ట్ జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీ సమర్థించారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే విధించాలని కేంద్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అవార్డ్ ప్రభుత్వ విధానానికి విరుద్ధమని, మోసం & క్రిమినల్ నేరం ద్వారా భారీ సంపాదనకు దారి తీసిందని ప్రభుత్వం ఆరోపించింది.
కన్సార్టియంలో ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలోని కన్సార్టియంలో యూకేకు చెందిన బ్రిటిష్ పెట్రోలియం (British Petroleum - BP), కెనడాకు చెందిన నికో రిసోర్సెస్ లిమిటెడ్ (NiCo Resources Limited) కూడా ఉన్నాయి.
2014 నుంచి కొనసాగుతున్న వివాదం
రిలయన్స్ ఇండస్ట్రీస్ - ప్రభుత్వ యాజమాన్యంలోని ONGC మధ్య కొనసాగుతున్న గ్యాస్ వివాదం కేసులో, 2018లో, సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ రిలయన్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ & దాని భాగస్వామ్య సంస్థలు ఇతరుల చమురు-గ్యాస్ బావుల నుంచి గ్యాస్ తీయడానికి ప్రయత్నించారంటూ చేసిన ఆరోపణలను కొట్టివేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ, కృష్ణా-గోదావరి బేసిన్‌లోని ONGC బ్లాక్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్సార్టియం అక్రమంగా గ్యాస్ ఉత్పత్తి చేస్తోదన్న భారత ప్రభుత్వ వాదనను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. అంతేకాదు, రిలయన్స్ నేతృత్వంలోని గ్రూప్‌నకు 8.3 మిలియన్ డాలర్లు (రూ. 564.44 మిలియన్లు) నష్టపరిహారం చెల్లించాలని కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది.
కేజీ బేసిన్‌లోని తన రెండో బ్లాక్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్రమంగా గ్యాస్ ఉత్పత్తి చేస్తోందంటూ, 2014లో, ONGC దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో, రిలయన్స్ నుంచి 1.46 బిలియన్ డాలర్ల జరిమానాను కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర
ఇవాళ (మంగళవారం, 09 మే 2023) రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఫ్లాట్‌గా ముగిసింది. ఒక్కో షేరు కేవలం రూ.4.80 లాభంతో రూ.2,476.70 వద్ద క్లోజయింది. గత ఆరు నెలల కాలంలో దాదాపు 4% నష్టపోయిన రిలయన్స్ కౌంటర్, గత ఏడాది కాలంలో చూస్తే ఫ్లాట్‌గా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.