Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశానికి (రిలయన్స్ ఏజీఎం) సిద్ధమవుతోంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏటా ఏజీఎం సమావేశం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ సమావేశం జరుగనుంది. 2016లో జియో టెలికాం నెట్‌వర్క్ లాంచింగ్ అనంతరం రిలయన్స్ ఏజీఎంలపై దేశం మొత్తం ఆసక్తి ఏర్పడింది. ఇందులో ప్రకటించే అంశాలు సాధారణ ప్రజలను సైతం ఆకర్శిస్తాయి.
ఏటా జరిగే ఈ సమావేశంలో సామాన్యులకు కనెక్ట్ అయ్యే విధంగా ఏదో ఒక ప్రకటన ఉంటుంది. ఈ సారి ఈ ఏజీఎంలో ఎలాంటి ప్రకటన ఉండబోతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. టెలికాం, రిటైల్, ఎనర్జీ వంటి కీలక రంగాలపై ఈ సారి ప్రకటనలు ఉండే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. 5జీ ప్లాన్లు, 5జీ ఫోన్లు, ఎయిర్ ఫైబర్ లాంచింగ్‌తో పాటు మరికొన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఏజీఎం ప్రారంభం కానుంది. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
2016లో దేశీయ టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో సంచలనాలకు వేదికైంది. ఆఫర్లు, లాంచింగ్‌తో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా అవతరించింది. 5జీ సేవల్లోను జియో అంతే స్పీడ్‌గా ఉంది. గతేడాది 5జీ సేవలను ప్రారంభించిన జియో దేశవ్యాప్తంగా ఏడాది చివరినాటికి దేశ వ్యాప్తంగా విస్తరించేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అపరిమిత 5జీ డేటాను జియో ఉచితంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో 28న జరిగే ఏజీఎంలో 4జీ ధరల్లోనే 5జీ ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
‘2జీ ముక్త్‌భారత్’ నినాదంతో జియో తక్కువ ధరలకే 4జీ ఫోన్లు లాంచ్ చేసింది. సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్ల ధరలు చాలా తక్కువ ధర ఉండడంతో పాటు ప్రత్యేకమైన టెలికాం ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. 5జీపై దృష్టి సారించిన రిలయన్స్ అత్యంత చవక ధరలో 5జీ ఫోన్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా గూగుల్‌తో జతకట్టింది. 28 జరిగే ఏజీఎంలో వీటికి సంబంధిచిన ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఫోన్ల ధరలు, ఫీచర్లు, స్పెషల్ ప్లాన్ల గురించి తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే !
అలాగే ఎయిర్ ఫైబర్ సేవలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జియో ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న రిలయన్స్ మరో సంచలనానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఫైబర్ కేబుల్స్ అవసరం లేకుండా ఎయిర్‌ఫైబర్ పేరుతో ఓ 5జీ డివైజ్‌నూ జియో తీసుకురాబోతోందట. ఈ ఏజీఎంలో జియో ఎయిర్‌ఫైబర్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. డివైజ్ లాంచ్ చేసిన కొన్ని రోజుల వరకు కొనుగోలుపై డిస్కౌంట్లు, కొద్ది కాలం పాటు ఫ్రీగా ఇచ్చే ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం.
ఐదేళ్లలో రెండు ఐపీఓలు రానున్నట్లు రిలయన్స్ 2019లోనే వెల్లడించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ రూ.8,278 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో రిలయన్స్ రిటైల్ ఐపీఓకు సంబంధించి ఏజీఎంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించీ అప్‌డేట్ ఉండే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలియాలంటే 28 వరకు వేచి చూడాల్సిందే.