Reliance AGM 2022: తమ వ్యాపారాలను మరింత విస్తరించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) నిర్ణయించింది. చాలా కంపెనీల బోర్డుల్లోంచి ముకేశ్‌ అంబానీ వైదొలగుతున్నారు. ఆయన వారసులు పగ్గాలు అందుకుంటున్నారు. ఈ ఏడాది దీపావళికి ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు ఆరంభిస్తామని కంపెనీ వెల్లడించింది. సోమవారం రిలయన్స్‌ 45వ ఏజీఎం జరిగిన సంగతి తెలిసిందే. కంపెనీ విస్తరణ నేపథ్యంలో బోర్డులోని ఇద్దరు తెలుగు వాళ్లపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.


పీఎంఎస్‌ ప్రసాద్‌


రిలయన్స్‌ ఇండస్ట్రీ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించిన తెలుగు వ్యక్తి పీఎంఎస్‌ ప్రసాద్‌ (PMS Prasad). కార్పొరేట్‌ వర్గాల్లో ఆయన తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గుంటూరులోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన కంపెనీలో 30 ఏళ్లుగా అనేక బాధ్యతలను నిర్వహించారు. ధీరూభాయ్‌ అంబానీ సమయంలో రిలయన్స్‌లో చేరి ఆయనకు నమ్మకస్థుడిగా ఎదిగారు. కొన్నాళ్లు సీఈవోగా పనిచేశారు. 1999లో ప్రపంచంలోనే అతిపెద్దదైన జామ్‌ నగర్‌ కాంప్లెక్స్‌ రిఫైనరీ నడిపించారు. జియో స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారు. పెట్రో కెమికల్స్, రిఫైనింగ్‌, మార్కెటింగ్‌, చమురు అణ్వేషణ, వెలికితీత, ఫైబర్స్‌ వ్యాపారాల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. 2008లో ఎనర్జీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు అందుకున్నారు. డెహ్రాడూన్‌లోని పెట్రోలియం ఇంజినీరింగ్‌ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. ప్రస్తుతం రిలయన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.


కేవీ చౌదరీ


రిలయన్స్‌ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న మరో తెలుగు పేరు కేవీ చౌదరీ. గతంలో కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల బోర్డు ఛైర్మన్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం. 2019లో ఆయన రిలయన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అనేక కమిటీల్లో కీలకంగా ఉన్నారు. ఆడిట్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిటిలీ, హ్యూమన్‌ రిసోర్సెస్‌, నామినేషన్‌, రెమ్యూనరేషన్‌ కమిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. స్టేక్‌ హోల్డర్స్‌ రిలేషన్‌షిప్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులు, పోస్టుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.