RIL 45th AGM: ఓటీటీలో రిలయన్స్ పెట్టుబడులు 

Reliance AGM 2022: ఇవాళ (సోమవారం - 29 ఆగస్టు 2022) మధ్యాహ్నం 2 గంటలకు రిలయన్స్ ఏజీఎం (Reliance AGM) ప్రారంభమైంది.

ABP Desam Last Updated: 29 Aug 2022 03:53 PM
రిలయన్స్ ఫ్యూచర్ లీడర్లను ప్రకటించిన ముకేశ్ అంబానీ 

రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ వ్యాపార బాధ్యతలను ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీకి కేటాయించారు. జియో బాధ్యతలను ఆకాశ్ అంబానీ చూసుకుంటారని, రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని ఇషా అంబానీకి, రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపార బాధ్యతలను అనంత్ అంబానీకి అప్పగిస్తున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. 

పెట్రో కెమికల్స్‌, టెక్స్‌టైల్‌ రంగంలో  రూ. 75,000 కోట్ల పెట్టుబడి

రిలయన్స్ పెట్రోకెమికల్స్, టెక్స్‌టైల్ వ్యాపారంలో రూ.75,000 కోట్ల పెట్టుబడి పెడతామని ముకేశ్ అంబానీ ప్రకటించారు. గతేడాది రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం తొమ్మిందింతలు వృద్ధి సాధించిందన్నారు. ఈ రంగంలో ఆదాయం ఒక బిలియన్ డాలర్లు దాటినట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఆయిల్ అండ్ కెమికల్స్ రంగలో రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. 

పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం గిగా ఫ్యాక్టరీ 

"పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం కొత్త గిగా ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలనుకుంటున్నాం. టెలికమ్యూనికేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, IoT ప్లాట్‌ఫామ్ లను అనుసంధానం చేస్తూ పవర్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ల రూపొందిస్తున్నాం" - ముకేశ్ అంబానీ 

రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ పై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన 

గ్రీన్ ఎనర్జీని స్కేల్‌లో ఉత్పత్తి చేయడానికి బయోమాస్‌ను ఇంధనంగా వినియోగించడం ప్రారంభించాం. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలో, దహేజ్ & హజీరా సైట్‌లలో దాదాపు 5% ఎనర్జీ వినియోగంలో గ్రీన్ పవర్ ను భర్తీ చేశామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.  ఒక సంవత్సరంలోనే, రిలయన్స్ పునరుత్పాదక ఇంధన వినియోగం 352% పెరిగింది. మా O2C ఆస్తులకు పునరుత్పాదక శక్తికి మారడంతో పాటుగా ఇటువంటి కార్యక్రమాలు నికర-కార్బన్ జీరోగా మారడానికి మా ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను." అని ముకేశ్ అంబానీ అన్నారు. 


 

ఓటీటీలో రిలయన్స్ పెట్టుబడులు 

రిలయన్స్ మీడియా బిజినెస్ గడిచిన ఏడాదిలో వృద్ధి నమోదు చేసిందని ముకేశ్ అంబానీ తెలిపారు.  సబ్ స్ర్కిప్షన్లు, ప్రకటనల ఆదాయం మరింత గణనీయ వృద్ధి నమోదుచేసిందని ఎంటర్ టైన్ మెంట్ విభాగం, మీడియా ఛానెళ్లలు దూసుకెళ్తున్నాయన్నారు. ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులు రిలయన్స్ దక్కించుకున్నాయన్నారు. మూవీ రైట్స్, ఓటీటీ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. 

Qualcommతో రిలయన్స్ భాగస్వామ్యం 

Qualcommతో రిలయన్స్ భాగస్వామ్యం అవుతోందని ముకేశ్ అంబానీ ప్రకటించారు. 'మేడ్ ఇన్ ఇండియా' 5G సహకార మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, శామ్‌సంగ్, సిస్కోలో ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలతో ఒప్పందాలు ఉన్నాయన్నారు.  రిలయన్స్ రిటైల్ రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్, రూ. 12,000 కోట్ల EBITDA రికార్డును సాధించిందన్నారు. రిలయన్స్ రిటైల్ ఆసియాలోని టాప్ 10 రిటైలర్లలో ఒకటిగా నిలిచిందన్నారు. 

ఆసియాలోని టాప్-10 రిటైలర్లలో రిలయన్స్ రిటైల్

వచ్చే ఏడాదిలో స్టేపుల్స్, హోమ్, పర్సనల్ కేర్,  జనరల్ మర్చండైజ్ కేటగిరీలలో అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించి, సొంత బ్రాండ్‌ల ఉనికిని బలోపేతం చేశామని ఇషా అంబానీ తెలిపారు.  WhatsApp-JioMart టైఅప్ అవుతున్నాయన్నారు. 

RIL 45th AGM - భారత్‌లో రిలయన్స్‌ అతిపెద్ద పన్ను చెల్లింపు సంస్థ

రిలయన్స్‌ అన్ని రంగాల్లో రాణించింది. ఏకీకృత ఆదాయం 47 శాతం పెరిగి రూ.7.93 లక్షల కోట్లకు చేరిందన్నారు ముఖేష్ అంబానీ. రిలయన్స్‌ ఎగుమతులు 75 శాతం ఎగబాకి రూ.2.50 లక్షల కోట్లకు చేరాయి. ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో రిలయన్స్‌ చెల్లించిన పన్నుల విలువ 38.8 శాతం పెరిగి రూ.1.88 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. భారత్‌లో రిలయన్స్‌ అతిపెద్ద పన్ను చెల్లింపు సంస్థగా నిలిచింది.  భారత మర్చండైజ్‌ ఎగుమతుల్లో రిలయన్స్‌ వాటా 8.4 శాతంగా ఉందన్నారు.

RIL 45వ AGM : వాట్సాప్-జియోమార్ట్ ఒప్పందం  

రిలయన్స్ ఏజీఎమ్ సమావేశంలో  ముఖేష్ అంబానీ కుమార్తె ఇషాను రిలయన్స్ గ్రూప్ రిటైల్ వ్యాపారానికి నాయకురాలిగా పరిచయం చేశారు. వాట్సాప్-జియోమార్ట్ ఒప్పందాన్ని ఇషా అంబానీ ప్రకటించారు. ఈ ఏడాది RIL FMCG వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు ఇషా అంబానీ తెలిపారు.

ఫైబర్‌ నెట్‌వర్క్‌లో రిలయన్స్ నంబర్‌.1: ముకేశ్‌ అంబానీ

గత ఏడాది భారత్‌లో అతిపెద్ద డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా జియో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని ముఖేష్ అంబానీ అన్నారు. 21 మిలియన్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లు ప్రతినెలా సగటున 20 జీబీ డేటాను వినియోగిస్తున్నారని చెప్పారు. 

రిలయన్స్ జియో నుంచి క్లౌడ్ పీసీ 

పర్సనల్ కంప్యూటర్, ల్యాప్ టాప్ ను ప్రతిసారీ అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందని ముకేశ్ అంబానీ అన్నారు. దీని కోసం చాలా ఖర్చువుతుందని, ఈ ఖర్చును నియంత్రించేందుకు రిలయన్స్ జియో క్లౌడ్ పీసీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇది రిలయన్స్ జియో 5జీ సర్వీసుల్లో భాగమేనని తెలిపారు. జియో ఫైబర్ ను ఉపయోగించి క్లౌడ్ లో వర్చువల్ పీసీని వినియోగించుకోవచ్చన్నారు. విద్యార్థులు, వ్యాపారులకు తక్కువ ధరకే క్లోడ్ పీసీని అందిస్తామన్నారు. 

దీపావళి నాటికి ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు 

Jio 5G Services : రిలయన్స్ ఇండస్ట్రీన్ వార్షిక సాధారణ సమావేశం జరుగుతోంది. వర్చువల్ గా నిర్వహిస్తున్న ఈ సమావేశం జియో 5జీ సేవలపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు.  దీపావళి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ముందుగా దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కతా నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 2023 డిసెంబర్ నాటికి దేశం మొత్తం జియో 5జీ సేవలు విస్తరిస్తామని వెల్లడించారు.  

Background

Reliance AGM 2022: ఇవాళ (సోమవారం - 29 ఆగస్టు 2022) మధ్యాహ్నం 2 గంటలకు రిలయన్స్ ఏజీఎం (Reliance AGM) ప్రారంభమవుతుంది. 


రిలయన్స్ ఏజీఎంను ఎక్కడ, ఎలా చూడాలి?
ఏజీఎంను వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కంపెనీ నిర్వహిస్తోంది. JioMeetతో పాటు ఐదు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఏకకాలంలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. కాబట్టి, చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, అందులో డేటా ఉంటే చాలు. కూర్చున్న చోటు నుంచే ఈ సమావేశాన్ని చూడవచ్చు, అంబానీ ప్రసంగాన్ని వినవచ్చు. 


గత వార్షిక సాధారణ సమావేశాల (AGM) ప్రసారాలను యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్‌లోనే కంపెనీ ఇచ్చింది. ఇప్పుడు కూ (Koo) ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ‍(Instagram) ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.


GMetri ద్వారా, రిలయన్స్ ఏజీఎం (Reliance AGM) వర్చువల్ రియాలిటీ (VR) ప్లాట్‌ఫామ్ ద్వారా సమావేశం జరుగుతుంది. ఈ విధానంలో, వర్చువల్‌ పద్ధతిలో మీరు కూడా పాల్గొనవచ్చు. లాంజ్‌ నుంచి వివిధ వర్చువల్ రూమ్స్‌లోకి ప్రవేశించవచ్చు, ఎగ్జిట్‌ కావచ్చు. ఇదే కంపెనీ వార్షిక నివేదిక 2021-22లో, వ్యాపారాల వారీగా ముఖ్యాంశాలను చదవవచ్చు, అర్ధం చేసుకోవచ్చు.


45వ ఏజీఎంకు సంబంధించిన వివరాలను ఎవరైనా సులభంగా తెలుసుకునేలా 7977111111 నంబర్‌తో వాట్సాప్ చాట్‌బాట్‌ను రిలయన్స్‌ యాక్టివేట్‌ చేసింది. ఏజీఎంకు సంబంధించిన తేదీలు, ప్రక్రియలను ఈ చాట్‌బాట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.


ఇచ్చిన నంబర్‌కు మీ మొబైల్‌ నంబర్‌తో 'హాయ్' అన్న సందేశం పంపితే చాలు. చాట్‌బాట్‌ యాక్టివేట్ అవుతుంది. ఆ వెంటనే మీకు తిరుగు మెసేజ్‌ వస్తుంది. ఏజీఎం (AGM) తేదీ, సమయం, దానిని ప్రత్యక్షంగా ఎలా చూడాలి, వాటాదారులు ఎలా ఓటు వేయవచ్చు లేదా ప్రశ్నలేమైనా ఉంటే ఎలా అడగవచ్చు మొదలైన విషయాలను చాట్‌బాట్‌ మీకు అందిస్తుంది. దాని సూచనలు పాటిస్తే మీరు ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు, సందేహాలు తీర్చుకోవచ్చు, మీరు రిలయన్స్‌ వాటాదారు అయితే ఓటు కూడా వేయవచ్చు.


సమావేశంలో ఏ నిర్ణయాలు ఉండవచ్చు?


5G సేవలు: మన దేశంలో 5G సేవలు ప్రారంభించడానికి రిలయన్స్‌ సంస్థ స్ప్రెక్ట్రం తీసుకుంది. దాని బ్లూప్రింట్‌ను నేటి సమావేశంలో ప్రకటిస్తారన్నది మార్కెట్‌ అంచనా. 


జియోఫోన్‌ 5G: 5G సేవల రోల్ అవుట్‌తో, కంపెనీ JioPhone 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించవచ్చు. దీని ధర రూ.9,000 - 12,000 మధ్య ఉండవచ్చు. JioPhone నెక్స్ట్‌ తరహాలోనే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేలా సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా కంపెనీ తీసుకువస్తుందని భావిస్తున్నారు.


వారసత్వం: ముఖేష్‌ భార్య నీత అంబానీ, ముగ్గురు పిల్లలకు కంపెనీలో మరిన్ని హోదాలు, బాధ్యతలు, అధికారాలు కట్టబెడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ప్రకటనలు చేస్తారని మార్కెట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తోంది.


గ్రీన్ ఎనర్జీ: ఈ నెలలోనే ఎనర్జీ కన్జర్వేషన్‌ (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. దీంతో, గ్రీన్ హైడ్రోజన్ ధరను తగ్గించడానికి RIL తన లక్ష్యాలను సవరించుకోవచ్చు. 


టెలికాం, రిటైల్‌ IPOలు: టెలికాం (జియో), రిలయన్స్‌ రిటైల్‌ బిజినెస్‌లను విడదీసి విడిగా లిస్ట్‌ చేయాలన్న ప్రతిపాదనలు కొన్నేళ్లుగా నలుగుతున్నాయి. ఈ ఏజీఎంలో వీటి టైమ్‌లైన్‌ గురించి ప్రకటన రావచ్చని ఇన్వెస్టర్లు ఆశగా ఉన్నారు.


ఏజీఎం నేపథ్యంలో, ఇవాళ్టి నెగెటివ్‌ మార్కెట్‌లోనూ రిలయన్స్‌ స్టాక్‌ పుంజుకుంది. రూ.2,585 దగ్గర నష్టంతో ప్రారంభమైన షేరు ధర, అక్కడి నుంచి పుంజుకుంటూ వస్తోంది. ఉదయం 11.45 గం. సమయానికి రూ.2,624 దగ్గర ఉంది. శుక్రవారం రూ.2618 దగ్గర ఈ స్టాక్‌ క్లోజయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.