Real Estate Investments: భారత దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అంటే.. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్, ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీల వంటి డెవలప్‌మెంట్స్ కోసం పెడుతున్న పెట్టుబడులు వేగం పెరుగుతోంది. కొవిడ్ తర్వాత, సొంత ఇంటి పట్ల భారతీయుల దృక్పథం మారింది. సొంత ఇల్లు ఉండడం ఎంత అవసరమో తెలిసొచ్చింది. దీంతో, నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ముగియడం, వ్యాపార కార్యకలాపాలు కూడా పెరగడంతో స్థిరాస్తి రంగంలో ఉత్సాహం పెరిగింది. దీంతో, ఈ రంగంలోకి పెట్టుబడులు ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన నివేదిక బయటకు వచ్చింది.
రియల్ ఎస్టేట్‌లో 32 శాతం పెరిగిన పెట్టుబడులు
భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు 32 శాతం పెరిగాయి, ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $7.8 మిలియన్లకు చేరాయి. కన్సల్టింగ్ సంస్థ 'సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్' CBRE South Asia Pvt Ltd.) తన నివేదికలో దీనికి సంబంధించిన డేటాను వెల్లడించింది. 'ఇండియా మార్కెట్ మానిటర్ - 2022' (India Market Monitor- 2022) పేరుతో రూపొందించిన ఈ నివేదికలో చాలా విషయాలు వెల్లడయ్యాయి. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు 2.3 బిలియన్ డాలర్లు. ఇవి, గత త్రైమాసికం కంటే 64 శాతం & గత సంవత్సరం ఇదే కాలం కంటే 115 శాతం వృద్ధి చెందాయి.
విదేశీ పెట్టుబడిదార్ల పైచేయి
మీడియా నివేదికల ప్రకారం.. 2022లో, మొత్తం దేశీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పరిమాణంలో విదేశీ పెట్టుబడిదార్లు (Foreign Investors) 57 శాతం వాటాతో ముందంజలో ఉన్నారు. ఇందులో.. కెనడియన్ పెట్టుబడిదార్లు దాదాపు 37 శాతం వాటా, ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ పెట్టుబడిదార్లు 15 శాతం వాటా కలిగి ఉన్నారు. 2022లో, మొత్తం పెట్టుబడిలో మిగిలిన 40 శాతాన్ని దేశీయ పెట్టుబడిదార్లు అందించారు.
మొదట దిల్లీ-NCR, ఆ తర్వాత ముంబై
2022 సంవత్సరంలో, విదేశీయుల నుంచి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు స్వీకరించడంలో దిల్లీ-NCR ముందంజలో ఉంది, ముంబై ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఈ రెండు చోట్ల మొత్తం పెట్టుబడిలో 56 శాతం విదేశీ పెట్టుబడిదార్ల నుంచే వచ్చింది. వీటిలో.. 48 శాతం వాటా భూ సేకరణ, సైట్స్ డెవలప్‌మెంట్‌ది కాగా.. ఆ తర్వాత 35 శాతం వాటాతో కార్యాలయాల సెగ్మెంట్ ఉంది. నివేదిక ప్రకారం, సైట్/భూ సేకరణ కోసం వచ్చిన మూలధనంలో దాదాపు 44 శాతం నివాస గృహాల అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టగా, 25 శాతాన్ని ఇతర అభివృద్ధి పనుల కోసం పెట్టుబడి పెట్టారు.
అద్దె 58 శాతం పెరుగుతుందని అంచనా
ఇంతకు ముందు వచ్చిన మరొక సర్వే ప్రకారం, 2023లో, వ్యయాల పెరుగుదల, ఆర్థిక హెచ్చుతగ్గుల కారణంగా ఇళ్ల ధరల్లో పెరుగుదల కనిపించవచ్చని వెల్లడైంది. దాదాపు 32 శాతం మంది డెవలపర్లు ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారని ఆ సర్వే వెల్లడించింది. 58 శాతం బిల్డర్లు అద్దె, తదితరాలను పెంచాలని భావిస్తున్నారు.
బడ్జెట్ నుంచి ఆశిస్తున్న 5 ప్రధాన వరాలివి, నిర్మలమ్మ కరుణిస్తే సామాన్యుడికి పండగే