Coin Vending Machines: చిల్లర మాలక్ష్మితో మహా పెద్ద సమస్యండీ బాబూ. నోట్లు దొరికినంత ఈజీగా నాణేలు దొరకట్లేదు. దేశంలోని లక్షలాది వ్యాపారస్తులను, కోట్లాది ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న నిత్య సమస్య ఇది. కాబట్టి, చిల్లరే కదాని చిరాగ్గా చూడటానికి వీల్లేదు. చిల్లర లేక, దుకాణదారులు ప్రజలకు బలవంతంగా చాక్లెట్లు, చిన్నపాటి వస్తువులు అంటగడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం, ఇబ్బంది పడుతూనే ఉన్నాం.


పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్న ఆర్‌బీఐ
రెపో రేటును 0.25 శాతం పెంచుతూ ఇవాళ (బుధవారం, 08 ఫిబ్రవరి 2023) ప్రకటన చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌, ఆ పెద్ద ప్రకటనతో పాటు మరికొన్ని నిర్ణయాలను కూడా ప్రకటించారు. ఆ నిర్ణయాల్లో ఒకటి.. చిల్లర నాణేలు అందించే యంత్రాలు లేదా కాయిన్‌ వెండింగ్‌ మెషీన్స్‌ (Coin vending machines). 


ప్రజలను మహా ఇబ్బంది పెడుతున్న చిల్లర సమస్యకు పరిష్కారంగా కాయిన్‌ వెండింగ్‌ మెషీన్స్‌ పైల‌ట్ ప్రాజెక్ట్‌ను ఆర్‌బీఐ ప్రారంభించ‌నున్నంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద, QR కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్లను RBI ఇన్‌స్టాల్ చేస్తుంది. తొలుత 12 నగరాల్లోని 19 చోట్ల చిల్లర నాణేల యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఇది కూడా ఒక లాంటి ATM లాంటిదే. ఇప్పటి వరకు మనం వినియోగిస్తున్న ఏటీఎం నుంచి కరెన్సీ నోట్లు వస్తాయి. ఈ కాయిన్‌ వెండింగ్‌ మెషీన్స్‌ నుంచి చిల్లర నాణేలు వస్తాయి. ఈ యంత్రాల వద్ద ఏర్పాటు చేసే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా నాణేలను పొందవచ్చు. వీటి నుంచి కరెన్సీ నోట్లు రావు.


చిల్లర నాణేయల యంత్రాల వినియోగం ద్వారా నాణేల లభ్యత, నాణేల వినియోగం మరింత పెరుగుతుంది, సులభతరం అవుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు.


స్పందనను బట్టి దేశవ్యాప్తంగా విస్తరణ
ప్రజల రద్దీ ఎక్కువగా ప్రాంతాలు - మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రాంతాల్లో కాయిన్‌ వెండింగ్‌ మెషీన్లను తొలుత ఏర్పాటు చేయనున్నారు. ప్రజల నుంచి వీటికి వచ్చే స్పందన, అనుభవాలను బట్టి తర్వాతి స్టెప్‌ తీసుకుంటారు. మార్పుచేర్పులతో దేశవ్యాప్తంగా యంత్రాల ఏర్పాటును విస్తరిస్తారు.


ఖాతాదారు బ్యాంకు ఖాతాలో జమ అయిన మొత్తాన్ని బట్టి, కాయిన్‌ వెండింగ్‌ మెషీన్ల నుంచి వచ్చే నాణేల విలువ ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది.


ఈ యంత్రాల ద్వారా నాణేలను పొందాలంటే, కస్టమర్ UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) చెల్లింపు ఎంపికను ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే మనం నోటు ఇచ్చి చిల్లర వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదు. జేబులో నోట్లు లేకపోయినా, స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా UPIతో నాణేలను పొందవచ్చు. నాణేలు తీసుకున్న కస్టమర్ బ్యాంక్‌ ఖాతా నుంచి ఆ మేరకు డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. 


కాయిన్‌ వెండింగ్‌ మెషీన్స్‌కు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విధివిధానాలు ఖరారు చేయలేదు. పైలట్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభిప్రాయాల ఆధారంగా మార్గదర్శకాలను రూపొందించి, జారీ చేస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ చెప్పారు.