RBI MPC Meeting: దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్ల పెంపును ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తున్న అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ (యూఎస్ ఫెడ్), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ తూరికి తమ పాత్రను పోషించాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంతు వచ్చింది. నేటి (బుధవారం) నుంచి శుక్రవారం వరకు RBI ద్రవ్య పరపతి కమిటీ (MPC) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకం కానున్నాయి. MPC నిర్ణయాలు శుక్రవారం వెల్లడవుతాయి. వడ్డీ రేట్లను RBI ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచుతుంది, ఆర్థిక వృద్ధి అంచనాలు, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు గురించి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుంది అన్న విషయాలను స్టాక్ మార్కెట్లు కీలకంగా గమనిస్తుంటాయి.
మరో 50 బేసిస్ పాయింట్లు
ప్రస్తుతం, ఆర్‌బీఐ లక్ష్యిత స్థాయి (కంఫర్ట్ రేంజ్) అయిన 6 శాతానికి పైగానే మన దేశంలో ద్రవ్యోల్బణం ఉంది. గత 8 నెలలుగా 6 శాతం పైగానే కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మే నెలలో 40 బేసిస్ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు, ఆగస్ట్‌లో మరో 50 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటును కేంద్ర బ్యాంక్ పెంచింది. మొత్తంగా, మే నుంచి ఇప్పటివరకు 140 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనివల్ల, ఆర్‌బీఐ రెపో రేటు 5.40 శాతానికి చేరింది. ఇప్పుడు పెంచితే వరుసగా నాలుగోసారి పెంచినట్లు అవుతుంది. ప్రస్తుత సమీక్షలో మరో 50 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచవచ్చని మార్కెట్ ఆశిస్తోంది. ఇదే జరిగితే, రెపో రేటు మూడేళ్ల గరిష్ట స్థాయి 5.9 శాతానికి చేరుతుంది. కరోనా ముందున్న స్థాయి ఇది.
కమొడిటీస్, చమురు ధరలు తగ్గుతున్నందున.. ద్రవ్యోల్బణ పరిస్థితులు త్వరలో చక్కబడతాయని ఆర్‌బీఐ భావిస్తే, వడ్డీ రేటును 25-35 బేసిస్ పాయింట్ల పెంపునకే పరిమితం చేసే అవకాశం కూడా ఉంది. అయితే అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం 50 బేసిస్ పాయింట్ల పెంపు తప్పకపోవచ్చు.
ఆర్థిక మాంద్యం - వృద్ధి అంచనాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పరుగులు తీస్తోంది. భారతదేశ వృద్ధి అవకాశాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. ఈ నేపథ్యంలో, ఆర్థిక వృద్ధి అంచనాలను కేంద్ర బ్యాంక్ సమీక్షించే అవకాశం ఉంది.
రూపాయి పరువు
అమెరికా డాలర్‌తో పోలిస్తే రోజురోజుకూ దిగజారిపోతున్న రూపాయి పరువును కాపాడటం ఇప్పుడు ఆర్‌బీఐకి అత్యంత ముఖ్యం. వడ్డీ రేటును నిర్ణయించే చర్చల్లో రూపాయి విలువ కూడా కీలక భాగం అవుతుంది.
బ్యాంకులు సిద్ధం
ఆర్‌బీఐ రెపో రేటు పెంచగానే, దానికి లింక్‌గా ఉన్న రెపో ఆధారిత వడ్డీ రేటు (RLLR) పెంచేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం నాడు రెపో రేటు పెంపు నిర్ణయం వెలువడగానే, అక్టోబరు 1 నుంచి కొత్త రేట్లు అమలు చేసి, ఆ మేరకు ముక్కు పిండి వసూలు చేసేందుకు బ్యాంకులు కాచుకుని ఉన్నాయి. ఈ పండగ సీజన్‌లో రుణాల గిరాకీ పెరిగింది కాబట్టి, నగదు సమీకరణ కోసం కొన్ని ప్రత్యేక డిపాజిట్ పథకాలనూ ప్రవేశ పెట్టొచ్చు. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో చాలామంది దీర్ఘకాలిక డిపాజిట్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకే బ్యాంకులు 400, 500, 550 రోజుల వ్యవధితో డిపాజిట్ పథకాలను తీసుకొస్తూ, 6-6.5 శాతం వడ్డీని ప్రకటిస్తున్నాయి.
డిసెంబర్ తర్వాత రేట్ల పెంపు నిలిపివేత!
డిసెంబర్ MPCలో, నిరాడంబరంగా 30-35 bps పెంపుతో రేట్ల పెంపులో వేగాన్ని ఆర్‌బీఐ తగ్గించవచ్చు. ఆ తర్వాత పెంపును నిలిపేసే అవకాశాలున్నాయి. అయితే, ద్రవ్యోల్బణ పథం మీద ఇది ఆధారపడి ఉంటుంది. రాబోయే ఎంపీసీ కేవలం ద్రవ్యోల్బణం మీద మాత్రమే ఉండదు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల పెంపు వల్ల రూపాయి విలువ, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై మీద పడుతున్న ప్రభావం మీద కూడా భవిష్యత్ ఎంపీసీలో చర్చ జరుగుతుంది. ఈ అంశాల ఆధారంగా అప్పుడు వడ్డీ రేట్ల మీద నిర్ణయం ఉంటుంది.