RBI MPC Meet February 2024 Decisions: గత కొంతకాలంగా మార్కెట్ ఊహించిందే జరిగింది. ఆర్‌బీఐ రెపో రేట్ ఈసారి కూడా మారలేదు. రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.5 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది.
రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగించడం వరుసగా ఇది ఆరోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో RBI MPC తదుపరి మీటింగ్ ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్ కొనసాగుతుంది.
2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.5 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్ కంటిన్యూ చేస్తోంది.
దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆశలపై చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) నీళ్లు చల్లుతోంది. ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండడంతో కోర్ ఇన్‌ఫ్లేషన్ దిగి రావడం లేదు. సీపీఐ ద్రవ్యోల్బణం (CPI Inflation) రేట్, వరుసగా నాలుగో నెలలోనూ, ఆర్‌బీఐ గరిష్ట సహన పరిమితి అయిన 6%కు దగ్గరగా ఉంది. 2023 డిసెంబర్‌లో ఇది 5.69% గా నమోదైంది, నవంబర్‌లోని 5.55% నుంచి కొంచెం పెరిగింది. అదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం 8.7% నుంచి 9.5% కు భారీగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం వల్లే CPI ఇన్‌ఫ్లేషన్ గత నాలుగు నెలల్లోనే అత్యధికంగా డిసెంబర్‌లో 5.69% కు చేరింది. 2024 జనవరి నెలలో ద్రవ్యోల్బణం లెక్కలు మరికొన్ని రోజుల్లోనే విడుదలవుతాయి.
వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌ల ప్రభావం
అంతర్జాతీయంగా చూస్తే, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, పాత రేట్లనే కంటిన్యూ చేస్తున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వంటి కీలక బ్యాంక్‌లు కీలక రేట్ల మీద 'స్టేటస్ కో' కొనసాగిస్తున్నాయి. ఆ ప్రభావం ఆర్‌బీఐ మీద కనిపించింది.