RBI MPC Meeting April 2024 Decisions: మన దేశంలో వడ్డీ రేట్లు ఏడాదికి పైగా అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయని, EMI ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, నిరీక్షణ కాలం నానాటికీ ఎక్కువవుతోంది. ఈ మధ్యలో కొన్నిసార్లు ఆశలు కల్పించినా చివరికి నిరాశే ఎదురైంది. ఈ రోజు (శుక్రవారం, 05 ఏప్రిల్‌ 2024) వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేయనుంది. 


ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి సమావేశం
కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో జరుగుతున్న రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ మొదటి సమావేశం ఇది. RBI MPC సమావేశం ప్రతి రెండు నెలలకు ఒకసారి జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, RBI MPC తొలి సమావేశం ఈ నెల 03న ప్రారంభమైంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ సమావేశం ఈ రోజు ఉదయం 10.30 గంటల కల్లా ముగుస్తుంది. 


మీటింగ్‌ ముగిసిన తర్వాత లైవ్‌లోకి రానున్న RBI గవర్నర్ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das), కీలక రేట్లపై MPC తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడిస్తారు. ఈ ఉదయం 10 గంటల తర్వాత దాస్‌ లైవ్‌లోకి వస్తారు.


14 నెలలుగా ఎలాంటి మార్పు లేదు
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి MPC సమావేశం కీలకమైనది. ఎందుకంటే, దీనికి ముందున్న ఆర్థిక సంవత్సరంలో ‍‌(2023-24), రెపో రేటులో చిన్న మార్పు కూడా చేయలేదు. రిజర్వ్ బ్యాంక్ చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో కీలక పాలసీ రేటును (రెపో రేటు) మార్చింది. ఆ సమయంలో రెపో రేటును 6.50 శాతానికి RBI పెంచింది. అప్పటి నుంచి రెపో రేటు 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంది. వరుసగా 6 సమావేశాల్లోనూ రెపో రేటును మార్చలేదు. అంటే 14 నెలలుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.


రేటును నిర్ణయించే కారకాలు
వాస్తవానికి, రెపో రేటుపై నిర్ణయం తీసుకునేటప్పుడు, ద్రవ్య విధాన కమిటీ ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. మొదటిది చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation), రెండోది దేశ ఆర్థిక వృద్ధి రేటు (Economy growth rate లేదా GDP growth rate). US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ‍‌(US FED) వైఖరి కూడా మన దేశంలో వడ్డీ రేట్లపై RBI నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. మన దేశంలో, ఫిబ్రవరి నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ 5.09 శాతానికి తగ్గింది. మార్చి నెల గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా రిజర్వ్ బ్యాంక్‌కి ఇది ఇప్పటికీ సౌకర్యవంతమైన స్థాయిలో లేదు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువకు తీసుకురావాలని ఆర్‌బీఐ కోరుకుంటోంది.


మరోవైపు, దేశీయ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో, GDP వృద్ధి రేటు అన్ని అంచనాలను అధిగమించి, 8 శాతాన్ని దాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి రేటు 8 శాతానికి మించి ఉండవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే ఆర్థిక వ్యవస్థ వేగం బాగానే ఉంది.


US FED వైఖరిని పరిశీలిస్తే, వడ్డీ రేట్లలో కోతలపై అది హింట్‌ ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి తగ్గింపు జరగదని కూడా చెప్పింది. యుఎస్ ఫెడ్ ఈ ఏడాదిలో మూడుసార్లు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే.. వడ్డీ రేట్లను తగ్గించే ముందు, అమెరికాలో ద్రవ్యోల్బణం పూర్తిగా నియంత్రణలోకి రావాలని ఫెడరల్ రిజర్వ్ కోరుకుంటోంది.


ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు, దేశాభివృద్ధి రేటు, యూఎస్‌ ఫెడ్ నుంచి సంకేతాలను బట్టి చూస్తే.. మన దేశంలో వడ్డీ రేట్లను తగ్గించే శుభవార్తను RBI ఈ రోజు కూడా ప్రకటించే అవకాశం లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.


అధిక వడ్డీ రేట్లు మార్కెట్లో లిక్విడిటీని తగ్గిస్తాయి, చివరికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సాయం చేస్తాయి. ఇలాంటి ప్రయోజనం ఉన్నప్పటికీ, ఖరీదైన రుణాలు దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, అధిక RoI ‍‌(Rate of Interest) కారణంగా మార్కెట్ తక్కువ రుణాలను తీసుకుంటుంది, తక్కువ పెట్టుబడులు పెడుతుంది. 


మరో ఆసక్తికర కథనం: జనం బీపీ పెంచుతున్న స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి