RBI MPC Meet April 2024 Decisions: వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించిన కామన్‌ మ్యాన్‌ మరోమారు నిరాశకు గురయ్యాడు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఈసారి కూడా పాలసీ రేటులో (రెపో రేట్‌) ఎలాంటి మార్పు చేయలేదు.


RBI MPC ‍‌(Monetary Policy Committee) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) వెల్లడించారు. స్థూల ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన అనంతరం రెపో రేటును (Repo Rate) స్థిరంగా ఉంచేందుకు ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును మార్చకూడదని నిర్ణయించారు.


ప్రస్తుతం రెపో రేట్‌ ఏ స్థాయిలో ఉంది?
రేపో రేట్‌ సహా కీలక బ్యాంక్‌ రేట్లను సమీక్షించేందుకు బుధవారం (03 ఏప్రిల్‌ 2024) ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం, ఈ రోజుతో (05 ఏప్రిల్‌ 2024) కలిపి మూడు రోజులు కొనసాగింది. సమావేశం అనంతరం, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ RBI MPC మీటింగ్‌ ఫలితాలను ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. 


రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా ముగిసిన ఏడో వరుస సమావేశం ఇది. ఈ ఏడాది జూన్‌లో RBI MPC తదుపరి మీటింగ్‌ ఉంటుంది. అప్పటి వరకు, మరో రెండు నెలల పాటు ఇదే రేట్‌ కొనసాగుతుంది. 


రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ చివరిసారిగా రెపో రేటును 14 నెలల క్రితం, 2023 ఫిబ్రవరిలో మార్చింది. అప్పట్లో రెపో రేటును 6.50 శాతానికి పెంచారు.


2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి సమావేశం
రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఏప్రిల్ 03న ప్రారంభమై ఈ రోజుతో ముగిసింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో, రెండు నెలల వ్యవధి చొప్పున మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అవుతుంది. ఇలా ఒక ఫైనాన్షియల్‌ ఇయర్‌లో మొత్తం ఆరు మీటింగ్స్‌ జరుగుతాయి. ఏప్రిల్ 01, 2024 నుంచి ప్రారంభమైన 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇది మొదటి MPC సమావేశం. దీనికి ముందు, మార్చి 31, 2024తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆరు సమావేశాలు జరిగాయి, ఆ ఆరు సమావేశాల్లోనూ రెపో రేటు 6.50 శాతం వద్ద మార్పు లేకుండా కొనసాగించారు.


స్థూల ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి
ప్రస్తుతం చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) 5 శాతానికి పైగానే కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ దానిని 4 శాతం దిగువకు తీసుకురావాలని భావిస్తోంది. 2024 ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.09 శాతంగా నమోదైంది. మార్చి నెల గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అద్భుతంగా ఉంది. 2023-24 డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు (GDP Growth Rate) 8 శాతానికి పైగా ఉంది. మార్చి త్రైమాసికం లెక్కలు విడుదల కావాల్సి ఉంది. మార్చి క్వార్టర్‌తో పాటు, మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 శాతానికి పైగా నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు.


ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పరిస్థితి ఇప్పటికీ అనిశ్చితంగానే ఉందని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు.


మరో ఆసక్తికర కథనం: రూ.70,000 నుంచి దిగొచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి