RBI Monetary Policy: టెన్షన్‌.. టెన్షన్‌. మన దేశంలో వడ్డీ రేట్లు ఎంత మేర పెరగనున్నాయో మరికాసేపట్లో తేలిపోతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India- RBI) మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee- MPC) నిర్ణయాలను ఇవాళ ప్రకటిస్తారు. 


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ (Shakti Kanta Das), ద్రవ్య విధాన కమిటీ ఫలితాలను ప్రకటించనున్నారు. రెపో రేటు పెంచారా, లేదా అనే ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం లభిస్తుంది. రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ 35 బేసిస్‌ పాయింట్లు (bps) లేదా 0.35 శాతం పెంచవచ్చని చాలా మంది మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. 


వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలను రిజర్వ్‌ బ్యాంక్‌ పరిగణనలోకి తీసుకుంటుంది. భారత ఆర్థిక వృద్ధి మీద వివిధ అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన అంచనాలను లెక్కలోకి తీసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఆర్థిక వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచుతూ ప్రపంచ బ్యాంక్‌ నిన్న (‌మంగళవారం) ఒక ప్రకటన విడుదల చేసింది.


RBI ద్రవ్య విధాన ప్రకటన ప్రత్యక్ష ప్రసారాన్ని ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించనున్న మానిటరీ పాలసీ నిర్ణయాలను మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాలనుకుంటే, మీరు దానిని యూట్యూబ్‌ (YouTube) ద్వారా చూసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి, ఇవాళ (డిసెంబర్ 7, 2022‌) ఉదయం 10 గంటలకు https://youtu.be/vY0sN5VxfBY యూట్యూబ్ లింక్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. 


ఇది కాకుండా, పాలసీ కమిటీ భేటీ ముగిసిన తర్వాత, మీరు ఆర్‌బీఐ గవర్నర్ విలేకరుల సమావేశాన్ని కూడా చూడవచ్చు. ఇది మధ్యాహ్నం 12 గంటలకు యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. https://youtu.be/mwI-Yjw0m_M. లింక్‌ ద్వారా మీరు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. 


RBI రేట్లు పెంచితే మీ జేబుపై భారం ఎంత పెరుగుతుంది?
రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ పెంచితే, దానికి అనుగుణంగా దేశంలోని అన్ని బ్యాంకులు తాము ఇచ్చిన రుణాల మీద వడ్డీ రేట్లను పెంచుతాయి. దీని వల్ల, ఇప్పటికే తీసుకున్న, భవిష్యత్తులో తీసుకోనున్న రుణాల మీద వడ్డీ రేటు పెరుగుతుంది. సాధారణ ప్రజలకు రుణాల EMIల భారం మరింత పెరుగుతుంది. రెపో రేటు ప్రస్తుతం 5.90 శాతం ఉండగా, 0.35 శాతం పెరిగితే అది 6.25 శాతానికి చేరుతుంది.


ద్రవ్యోల్బణం రేటు, జీడీపీ గణాంకాల అంచనాలను విడుదల చేయనున్న ఆర్‌బీఐ
ఈ ద్రవ్య విధాన సమావేశంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం & రాబోయే కాలంలో భారత ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ రేటు అంచనాలను కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్‌ విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులు,  కోట్లాది మంది ప్రజలు ఈ సమావేశాన్ని ఆసక్తిగా గమనిస్తారు. ఆర్‌బీఐ నిర్ణయాలకు అనుగుణంగా భవిష్యత్‌ నిర్ణయాలు తీసుకుంటారు.