Repo Rate Unchanged: రెపోరేట్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని RBI ప్రకటించింది. ప్రస్తుతమున్న 6.5%నే కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. రెపోరేటులో మార్పులు చేయకపోవడం వరుసగా ఇది 9వసారి. RBIకి చెందిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 9వసారి సమావేశమైన కమిటీ పాలసీ రేట్‌లను అదే విధంగా ఉంచాలని భావించింది. అయితే..ఆరుగురు సభ్యుల్లో నలుగురు ప్రస్తుతమున్న రెపోరేటునే కొనసాగించాలని ఓటు వేసినట్టు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
"ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రెపోరేటుని 6.5% గానే కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సభ్యుల్లో నలుగురు ఇదే అభిప్రాయానికి మద్దతు పలికారు"
- శక్తికాంత దాస్, RBI గవర్నర్
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) 6.25% గానే కొనసాగనుండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటులో ఎలాంటి మార్పులు లేకుండా 6.75%గానే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2% గా అంచనా వేసింది RBI.ఇక ద్రవ్యోల్బణ రేటుని 4.5%గా అంచనా వేసింది. అయితే..ఏప్రిల్ మే నెలల్లో ద్రవ్యోల్బణం కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ జూన్‌లో మళ్లీ పెరుగుదల నమోదైంది. ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని RBI వెల్లడించింది. ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాల రాకతో కొంత వరకూ ఈ ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేసింది. ఆగస్టు 2వ తేదీ నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో 675 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ప్రకటించింది. పర్సనల్ లోన్స్‌లో వృద్ధి కనిపిస్తోందని వెల్లడించింది. అయితే..ఇదే సమయంలో ఈ రుణాలను పర్యవేక్షించాల్సిన అవసరమూ ఉందని అభిప్రాయపడింది.