Rakesh Jhunjhunwala Stocks: భారతీయ స్టాక్ మార్కెట్‌లో బిగ్ బుల్ (Big Bull), ఇండియన్ వారెన్ బఫెట్ (indian Warren Buffett) అని పేరు తెచ్చుకున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్స్‌ భారీగా రాణిస్తున్నాయి. 


ఈ ఏడాది (2022) ఆగస్టు 14వ తేదీన గుండెపోటుతో రాకీ భాయ్‌ మరణించారు, మార్కెట్‌ నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నారు. కానీ ఆయన ఆలోచనలు, పెట్టుబడులు భారతీయ ఇన్వెస్టర్లకు నిరంతరం స్ఫూర్తిని పంచుతూనే ఉన్నాయి, గెలుపు సూత్రాలు నేర్పిస్తూనే ఉన్నాయి. 


బిగ్ బుల్ పోర్ట్‌ఫోలియో 2 సంవత్సరాల్లో రెట్టింపు
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో విలువ ఈ రెండేళ్లలో రెట్టింపయింది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయన పోర్ట్‌ఫోలియో విలువ 31 శాతం పెరిగింది. ప్రస్తుతం (2022 డిసెంబర్‌ చివరి నాటికి)... రాకీ భాయ్‌ పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు రూ. 32 వేల కోట్లు. ఇది, డిసెంబర్ 2021లో రూ. 24 వేల 500 కోట్లుగా ఉండగా... డిసెంబర్ 2020లో రూ. 16 వేల 727 కోట్లుగా ఉంది. అంటే... 2020 డిసెంబర్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు, ఈ రెండేళ్లలో పోర్ట్‌ఫోలియో విలువ రెట్టింపు అయింది.


రాకీ భాయ్‌ పోర్ట్‌ఫోలియోలో టాప్ హోల్డింగ్.. టైటన్‌
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఉన్న పెట్టుబడులను పరిశీలిస్తే... టైటన్ ఇప్పటికీ ఆయన టాప్ హోల్డింగ్స్‌లో ఉంది. టాటా గ్రూప్‌నకు చెందిన టైటన్‌ కంపెనీలో (Titan Company Ltd) బిగ్‌ బుల్‌కు 5.5 శాతం వాటా ఉంది. ప్రస్తుత షేర్‌ విలువ ప్రకారం ఈ 5.5 శాతం వాటా విలువ రూ. 12 వేల 318 కోట్లు. మరో టాటా గ్రూప్ కంపెనీ, తాజ్ హోటల్‌ను కలిగి ఉన్న ఇండియన్ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌లో (Indian Hotels Company Limited) రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2 శాతం వాటా ఉంది. 


ఇది కాకుండా... కెనరా బ్యాంక్ ‍‌(Canara Bank), మెట్రో బ్రాండ్స్‌ (Metro Brands), ఫెడరల్ బ్యాంక్ (Federal Bank), ఆటోలైన్ ఇండస్ట్రీస్ ‍‌(Autoline Industries), ఎస్కార్ట్స్ కుబోటా ‍‌(Escorts Kubota Ltd), ఫోర్టిస్ హెల్త్‌కేర్ (Fortis Healthcare), స్టార్‌ హెల్త్‌ (Star Health and Allied Insurance), టాటా కమ్యూనికేషన్స్‌ (Tata Communications) కంపెనీల షేర్లు కూడా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.


ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికి కొన్ని నెలల ముందు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల మీద ఝున్‌ఝున్‌వాలా చాలా బుల్లిష్‌గా ఉన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వాల్యుయేషన్ చాలా ఆకర్షణీయంగా ఉందని ఆయన తరచూ చెప్పారు. ఆయన బెట్‌ నిజమని రుజువైంది. గత కొన్ని నెలల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు తమ ఇన్వెస్టర్లకు 100 నుంచి 250 శాతం వరకు లాభాలు అందించాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.