Rajesh Exports Denies SEBI Reports: భారత కార్పొరేట్ రంగంలో ఎన్నడూ వినని రీతిలో, ఏకంగా రూ. 15.15 లక్షల కోట్ల అతిపెద్ద ఆర్థిక అక్రమాల సంచలనం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బంగారం శుద్ధి, ఎగుమతుల సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ పై దేశీయ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి సుమారు 109 పేజీలతో కూడిన మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఈ నివేదికలో కంపెనీ చూపించిన మొత్తం గ్రూప్ ఆదాయంలో దాదాపు 99.8% ప్రాఫిట్స్, ఆదాయం ఫేక్ అని సెబి నిర్ధారించడం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది.
సెబి జరిపిన ప్రాథమిక విచారణ ప్రకారం, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ 2021 నుండి 2025 మధ్య కాలంలో తన వ్యాపార సామర్థ్యాన్ని, ఆదాయాన్ని అత్యంత భారీగా చూపించింది. వాస్తవానికి కంపెనీకి వచ్చే రెవెన్యూ కేవలం 1 నుండి 3 శాతం మాత్రమే కాగా, విదేశీ సబ్సిడీ కంపెనీ ముఖ్యంగా స్విట్జర్లాండ్‌కు చెందిన వాల్‌కాంబి ఎస్ఏ పేరుతో ఏకంగా 97% నుండి 99% వరకు అదనపు బోగస్ టర్నోవర్ సృష్టించినట్లు సెబి గుర్తించింది. ఈ విదేశీ కంపెనీల అడిటెడ్ అకౌంట్లను పరిశీలిస్తే అక్కడ అసలు ఎలాంటి వ్యాపారమే జరగలేదని తేలింది. దీంతో కంపెనీ సీఎండీ రాజేశ్ మెహతాను కంపెనీ షేర్లలో , సెక్యూరిటీస్ మార్కెట్‌లో ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా సెబి తక్షణ నిషేధం విధించింది.
సెబి జారీ చేసిన మధ్యంతర ఆదేశాలపై కంపెనీ గట్టిగా స్పందించింది. తమ గ్రూప్ ఆదాయంలో ఎలాంటి తప్పుడు లెక్కలు లేవని, సెబి పేర్కొన్న అంశాలన్నీ ప్రాథమిక అంచనాలు మాత్రమేనని బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈ స్వర్ణ శుద్ధి, జ్యువెలరీ దిగ్గజం స్పష్టం చేసింది. గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ఈ వివాదంపై తొలిసారిగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. సెబి పరిశోధనకు, తమ లెక్కలకు మధ్య ఎక్కడో ‘కమ్యూనికేషన్ గ్యాప్’ వల్ల అయోమయం నెలకొందని సంస్థ అభిప్రాయపడింది. తాము ప్రకటించిన ఆదాయం వంద శాతం వాస్తవమని, నిబంధనలకు విరుద్ధంగా టర్నోవర్‌ను పెంచి చూపించలేదని పేర్కొంది. సెబి లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడానికి అవసరమైన అన్ని అదనపు పత్రాలు, ప్రామాణిక రికార్డులను సమర్పించే ప్రక్రియలో తాము ఉన్నామని వెల్లడించింది.
మార్చి 2024లో ఒక షేర్‌హోల్డర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెబి ఈ దర్యాప్తును ప్రారంభించింది. కంపెనీ ఆదాయంలో దాదాపు 97% నుండి 99% వరకు స్విట్జర్లాండ్‌కు చెందిన ‘వాల్‌కాంబి ఎస్ఏ’ (Valcambi SA) వంటి విదేశీ సబ్సిడీ సంస్థల నుంచే వస్తోందని, అయితే గ్రూప్ స్థాయిలో చూపిస్తున్న ఆదాయానికి, క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన నివేదికలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందనేది సెబి ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే సంస్థ సీఎండీ రాజేశ్ మెహతాపై సెబి షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించి తాత్కాలిక నిషేధం విధించింది.
సెబి జారీ చేసిన ఈ 109 పేజీల నివేదిక కేవలం ఒక తాత్కాలిక నివారణ చర్య మాత్రమేనని, దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం , తీర్పు వెలువడలేదని కంపెనీ గుర్తుచేసింది. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో మార్కెట్ ప్రయోజనాల కోసం తీసుకునే ఇటువంటి ముందస్తు చర్యలపై తాము చట్టపరంగా స్పందించి, పూర్తి ఆధారాలతో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని కంపెనీ చైర్మన్ రాజేశ్ మెహతా ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం మార్కెట్‌లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 104.65 వద్ద ముగిశాయి. లీగల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి కార్పొరేట్ విచారణలు ముగిసి తుది తీర్పు రావడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ కంపెనీ సరైన ఆధారాలు సమర్పించలేకపో తే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
