PM Kisan Yojana: దేశంలోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను ఫిబ్రవరి 28న జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.21వేల కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.


ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మందికి రైతులకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది. దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ‘నమో షేత్కారీ మహాసమ్మన్ నిధి’ రెండో, మూడో విడత నిధులను సైతం ప్రధాని పంపిణీ చేయనున్నారు. దీంతో మహారాష్ట్రవ్యాప్తంగా దాదాపు 88 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో భాగంగా ఏడాదికి రూ.6వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున సాయం విడుదల చేస్తూ వస్తోంది.


ఇప్పటి వరకు మొత్తం 15 విడతలలో సమ్మాన్ నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేసింది. ఇక 16వ విడత సహాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా గతేడాది నవంబర్‌ 15న ప్రధాని 15వ విడతలో 8 వేల కోట్లకుపైగా రైతులకు రూ.18వేల కోట్లు జమ చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం ఆవాస్ యోజనను ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.375 కోట్లను 2.50 లక్షల మంది లబ్ధిదారులకు బదిలీ చేస్తారు. దాంతో పాటు మహారాష్ట్రలో రూ.1,300 కోట్లకుపైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు.


పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ పీఎం కిసాన్‌ అందుకున్న రైతులు తప్పనిసరిగా eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోని రైతులకు ఈ 16వ విడత డబ్బులు అందవని గుర్తించుకోండి. eKYC సేవలను పీఎం కిసాన్ పోర్టల్‌లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌లలో పొందవచోచ్చు. eKYCని అమలు చేయడం వెనుక ఉన్న హేతువు ఏమిటంటే, లక్ష్యంగా చేసుకున్న లబ్ధిదారులు నేరుగా వారి ఆధార్-సీడెడ్ బ్యాంక్ ఖాతాలలో పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందేలా చేయడం. అలాగే మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించడం.


పీఎం కిసాన్ స్కీమ్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..


➥ పీఎం పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి


➥ అందులో రైతుల విభాగం (Farmer Cornor)లో నో యువర్ స్టేటస్ (Know Your Status) మీద క్లిక్ చేయండి.


➥ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా (Captcha Code) ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయండి.


➥ రీ డైరెక్ట్ అయిన పేజీలో మీ పీఎం కిసాన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి


➥ మీకు ఏమైనా సందేహాలు ఉంటే రైతులు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్లు 155261 / లేదా 011- 24300606కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.


జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..


➥ మొదటగా రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.


➥ హోం పేజీలో ఫార్మర్ కార్నర్ లో బెనిఫిషియ‌రీ లిస్ట్‌ (Beneficiary List) మీద క్లిక్‌ చేయాలి.


➥ ఓపెన్ అయిన పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను సెలక్ట్ చేసి ‘గెట్ రిపోర్ట్‌’పై క్లిక్ చేయండి


➥ పీఎం కిసాన్ సంబంధించి 15వ విడత ల‌బ్ధిదారుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.