Sheikh Tamim Bin Hamad Al Thani Networth: ఖతర్‌ అమీర్‌ ‍‌(పాలకుడు) షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని రెండు రోజుల పర్యటన కోసం భారత్‌ చేసుకున్నారు. షేక్ తమీమ్‌ ఈ రోజు, రేపు (ఫిబ్రవరి 17-18 తేదీలలో) భారతదేశంలో పర్యటిస్తారు. దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానికి అరుదైన గౌరవం లభించింది. భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి షేక్ తమీమ్‌కు స్వాగతం పలికారు. గత దశాబ్ద కాలంలో, భారతదేశంలో ఇది ఆయన మొదటి పర్యటన. షేక్ తమీమ్‌ పర్యటనను భారతదేశానికి చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. ఈ టూర్‌లో, భారతదేశం - ఖతర్‌ ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత వంటివి చర్చల్లో భాగం అవుతాయని, ఆయా రంగాలకు గట్టి ఊతం దొరుకుతుందని మార్కెట్‌ భావిస్తోంది. 


ఖతర్‌ పాలకుడి ఆస్తుల విలువ ఎంత?
ఖతర్‌‌లోని సుప్రీం పాలకుడిని అమీర్‌ అని పిలుస్తారు. ఖతర్‌ అమీర్‌ షేక్ తమీమ్‌ బిన్ హమద్ అల్ థాని ప్రపంచంలో తొమ్మిదో ధనవంతుడైన రాజు. ఆయనకు దాదాపు 335 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని 2023లో ఖతర్‌ అమీర్‌ అయ్యారు. దోహాలోని రాయల్ ప్యాలెస్‌లో నివసించే ఈ ధనవంతుడికి మూడు వివాహాలు జరిగాయి, 13 మంది పిల్లలు ఉన్నారు. 100కి పైగా గదులు & ఒక బాల్ రూమ్ ఉన్న ఈ ప్యాలెస్ విలువ దాదాపు 1 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఈ రాజభవనం చాలా విలాసవంతంగా ఉంది, దీనిలోని కొన్ని భాగాలు బంగారు పూతతో ఉంటాయి. ఈ రాజభవనంలో 500 కార్ల పార్కింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లో 124 మీటర్ల పొడవైన బోట్‌ కూడా ఉంది, దీని విలువ దాదాపు 3.3 బిలియన్ రూపాయలు. ప్యాలెస్‌లో ఓ హెలిప్యాడ్ కూడా ఉంది. 


అత్యుత్తమ లగ్జరీ కార్లు
షేక్ తమీమ్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర రోల్స్ రాయిస్ నుంచి బుగాట్టి, లంబోర్గిని, ఫెరారీ బ్రాండ్‌ వరకు చాలా మోడల్‌ కార్లు ఉన్నాయి. 1980 జూన్ 3వ తేదీన జన్మించిన షేక్ తమీమ్‌, మాజీ అమీర్‌ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ నాలుగో కుమారుడు. లండన్‌లోని హారో స్కూల్‌లో షేక్‌ తమీమ్‌ చదువుకున్నారు, 1998లో రాయల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 


ఖతర్‌ తలసరి ఆదాయం భారత్‌ కంటే ఎక్కువ
రెండు దేశాల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, భారతదేశం ఆర్థిక వ్యవస్థ విలువ 4.27 ట్రిలియన్ డాలర్లు, ఖతర్‌ GDP విలువ 240.217 బిలియన్ డాలర్లు. అయినప్పటికీ, ఖతర్‌లో తలసరి ఆదాయం 1.14,648 డాలర్లు. తలసరి ఆదాయం లిస్ట్‌లో, ఖతర్‌ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. ఖతర్‌ కరెన్సీని 'ఖతారీ రియాల్' అని పిలుస్తారు. ఇది, దాదాపు 23 రూపాయలకు సమానం. 


ఖతర్‌ ఆదాయ వనరు
ప్రపంచంలో మూడో అతి పెద్ద గ్యాస్‌ నిల్వలు ఖతర్‌లో ఉన్నాయి. రష్యా మొదటి స్థానంలో, ఇరాన్ రెండో స్థానంలో ఉన్నాయి. ఖతర్‌ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సహజ వాయువును ఎగుమతి చేస్తుంది. ఆ దేశం ఆదాయంలో ఎక్కువ భాగం పెట్రోలియం & సహజ వాయువు అమ్మకాల నుంచి వస్తుంది. 


మరో ఆసక్తికర కథనం: భారత్‌లో ఉద్యోగాలకు 'టెస్లా' ప్రకటన - మోదీ చేసిన 'మ్యాజిక్‌' ఇది