New Income Tax: దేశంలోని మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను నిబంధనల్లో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం.. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ఇకపై *రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో ఈ పరిమితి రూ. 7 లక్షల వరకు మాత్రమే ఉండగా, ఇప్పుడు దానిని ఏకంగా రూ. 12 లక్షలకు పెంచడం విశేషం. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వేతన జీవుల చేతిలో అదనపు నగదు మిగిలి, వారి కొనుగోలు శక్తి పెరగనుంది.
జీతం తీసుకునే వారికి అదనపు ప్రయోజనం
కేవలం పన్ను మినహాయింపు పరిమితి పెంపు మాత్రమే కాకుండా, జీతం తీసుకునే ఉద్యోగులకు మరో తీపి కబురు అందింది. గతంలో ఉన్న రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 75,000 కు పెంచారు. దీనివల్ల ఉద్యోగుల పన్ను పరిమితి వాస్తవానికి రూ. 12.75 లక్షల వరకు చేరుతుంది. అంటే, ఒక ఉద్యోగి సంవత్సరానికి రూ. 12.75 లక్షల జీతం పొందుతున్నా, స్టాండర్డ్ డిడక్షన్ , సెక్షన్ 87A కింద లభించే రీబేట్ (రూ. 60,000 వరకు) కలగలిపి నికర పన్ను సున్నా అవుతుంది. ఈ మార్పుల వల్ల సగటున నెలకు సుమారు రూ. 6,600 వరకు అదనంగా పొదుపు చేసుకునే అవకాశం ఉద్యోగులకు కలుగుతుంది.
కొత్త ఆదాయపు పన్ను స్లాబులు (New Tax Slabs) కొత్త పన్ను విధానంలో స్లాబులను మరింత సరళీకృతం చేశారు. అవేమిటంటే రూ. 4 లక్షల వరకు: ఏమీ లేదు (NIL) రూ. 4 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు: 5 శాతం రూ. 8 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు: 10 శాతం రూ. 12 లక్షల నుండి రూ. 16 లక్షల వరకు: 15 శాతం రూ. 16 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు: 20 శాతం రూ. 20 లక్షల నుండి రూ. 24 లక్షల వరకు: 25 శాతం రూ. 24 లక్షల కంటే ఎక్కువ: 30 శాతం
ఎవరికి ఎంత లాభం?
ఈ కొత్త విధానం వల్ల అధిక ఆదాయం ఉన్న వారికి కూడా గణనీయమైన పన్ను ఆదా అవుతుంది. ఉదాహరణకు, రూ. 16 లక్షల ఆదాయం ఉన్న వారికి సుమారు రూ. 50 వేల వరకు, రూ. 20 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ. 90 వేల వరకు పన్ను ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రయోజనాలన్నీ కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయని, పాత పన్ను విధానంలో (Old Regime) ఉండేవారికి గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని పన్ను నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే ఈ మార్పులు పెరిగిన ధరల నేపథ్యంలో సామాన్యుడికి కొంత ఊరటనిస్తాయని భావిస్తున్నారు.
