Apply For A Bank Loan With Poor Credit Score: ఏ ఒక్కరి జీవితంలోనూ భరోసా ఉండదు, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తుతుందో ఎవరూ చెప్పలేరు. అత్యవసర సమయంలో అకస్మాత్తుగా డబ్బు అవసరం అయినప్పుడు వ్యక్తిగత రుణం (Personal Loan) త్వరగా చేతికి వస్తుంది, ఆపద సమయంలో ఆదుకుంటుంది. అయితే, పేలవమైన క్రెడిట్ స్కోర్ (Poor Credit Score) కారణంగా పర్సనల్ లోన్ పొందడంలో సమస్యలు ఎదురుకావచ్చు. బ్యాడ్ క్రెడిట్ స్కోర్ కారణంగా బ్యాంక్ మిమ్మల్ని ప్రమాదకర ఖాతాదారు (Risky customer)గా చూస్తుంది & రుణం ఇవ్వడంలో వెనుకాడుతుంది. అయితే, మీకు బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి.
క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?
క్రెడిట్ స్కోర్ అనేది 300-900 మధ్య ఉండే 3-అంకెల సంఖ్య. ఇది మీ రుణ చరిత్రను, అంటే, మీ మునుపటి & ప్రస్తుత రుణాలను ఎంత బాధ్యతాయుతంగా చెల్లించారో చూపిస్తుంది. సాధారణంగా, 650 కంటే తక్కువ స్కోర్‌ను బ్యాడ్/పూర్ స్కోర్‌గా పరిగణిస్తారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది తక్కువ స్కోర్ అయినప్పటికీ మీకు లోన్ రాదని అర్ధం కాదు. ఇది, రుణం పొందడానికి మీకున్న మార్గాలను పరిమితం చేస్తుంది. దీని అర్ధం... క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ పర్సనల్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
లోన్ ఆమోదం పొందే అవకాశాలను ఎలా పెంచుకోవాలి?
-- మీ ఇన్‌కమ్ ప్రొఫైల్‌ను మీ బలంగా మార్చుకోండి. మీకు సరైన క్రెడిట్ స్కోర్ లేకపోయినప్పటికీ, స్థిరమైన ఆదాయ వనరు ఉందన్న విషయాన్ని బ్యాంక్‌కు అర్ధమయ్యేలా చూపించండి. దీనికి తగ్గ ఆధారాలు చూపించండి. ఫలితంగా, పూర్ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ, మీరు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని బ్యాంక్ అర్థం చేసుకుంటుంది. మీ రుణం ఆమోదం పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
-- సురక్షిత రుణం (Secured loan) ఆప్షన్ ఎంచుకోండి. దీనివల్ల లోన్ మంజూరయ్యే అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి. రుణం తీసుకోవడానికి ఏదైనా ఆస్తిని గ్యారెంటీగా బ్యాంక్‌లో డిపాజిట్ చేసినప్పుడు, మీరు ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించగలరని బ్యాంక్‌కు విశ్వసిస్తుంది.
-- తక్కువ మొత్తంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోండి. ఇది రుణదాతకు (బ్యాంక్) తక్కువ రిస్క్ వైపు ఉంచుతుంది & లోన్ ఆమోదం పొందే అవకాశాలను పెంచుతుంది.
-- పూర్ క్రెడిట్ స్కోర్‌తో అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణాన్ని పొందడానికి, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారిని గ్యారంటర్‌గా ఎంచుకోండి. ఇది రుణం పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది.
-- చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీకు ఏదైనా బ్యాంక్ లోన్ బకాయి ఉన్నా లేదా బిల్లు చెల్లించడం మర్చిపోయినా, రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు దానిని చెల్లించండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది.
మరో ఆసక్తికర కథనం: ట్రంప్ బ్యాకప్, బిట్‌కాయిన్ ఊపు - ప్రమాణ స్వీకారానికి ముందు ఆల్ టైమ్ హై