ITR Filing FY 2021-22: ఆదాయపన్ను రిటర్ను ఫైలింగ్‌ తుది గడువు దగ్గరపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైల్‌ (ITR Filing) చేసేందుకు జులై 31 చివరి తేదీ. అయితే చాలామంది పన్ను చెల్లింపుదారులు ఫైల్‌ చేసేందుకు ఆఖరి క్షణాల వరకు వేచి చూస్తుంటారు. గత రెండేళ్లు తుది గడువును అనేకసార్లు పొడగించడంతో ఈసారీ అలాగే జరుగుతుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరి నిపుణులు ఏమంటున్నారో చూద్దామా!!


కరోనా వైరస్‌ మహమ్మారి, ఆదాయపన్ను శాఖా (Income Tax New Portal) కొత్త వెబ్‌సైట్‌ ఆవిష్కరించడం, అందులో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో రెండేళ్లుగా ఐటీఆర్‌ ఫైలింగ్‌ తుది గడువును చాలాసార్లు పొడగించారు. కాగా 2022, జులై 2న ఆదాయపన్ను శాఖా ఓ ట్వీట్‌ చేసింది. ఐటీఆర్‌ వెబ్‌సైట్‌కు (ITR Portal) అవాంఛిత ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సాఫ్ట్‌వేర్‌ ప్రొవైడర్‌ ఇన్ఫోసిస్‌ చురుగ్గా చర్యలు తీసుకుంటుందని తెలిపింది.


'ఐటీడీ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. టాక్స్‌ పోర్టల్‌కు అవాంఛిత ట్రాఫిక్‌ వస్తున్నట్టు ఇన్ఫోసిస్‌ గుర్తించింది. పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు. కొందరు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు చింతిస్తున్నాం' అని ఐటీ శాఖ ట్వీట్‌ చేసింది.


ఈ ట్వీటును బట్టి ఐటీఆర్‌ తుది గడువును పొడగించే అవకాశం ఉందని సాగ్‌ ఇన్ఫోటెక్‌ ఎండీ అమిత్‌ గుప్తా అంచనా వేశారు. కొత్త వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన ఏడాదిన్నర తర్వాతా సాంకేతిక ఇబ్బందులు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బహుశా యూజర్లు ముందుగానే ఐటీఆర్‌ ఫైల్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండటం ఇందుకు ఓ కారణం కావొచ్చని వెల్లడించారు. ఈ ఏడాది ఐటీఆర్‌ ఫారాలను ముందుగానే విడుదల చేయడంతో తుది గడువు పొడగింపు ఉండకపోవచ్చనీ అంటున్నారు. పోర్టల్‌ సతాయిస్తే మాత్రం పెంచక తప్పదని స్పష్టం చేశారు.


కోట్ల మంది పన్ను చెల్లింపు దారులు తక్కువ వ్యవధిలోనే ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం కష్టమని గుప్తా సచ్‌దేవా కంపెనీ ప్రతినిధి గౌరవ్‌ గుంజన్‌ అంటున్నారు. నిజానికి 2020-21 ఏడాది తుది గడువును 2022, మార్చి 15 వరకూ పొడగించిన సంగతిని గుర్తు చేశారు. ఇన్‌కమ్‌ టాక్స్‌ గణాంకాల ప్రకారం మొత్తం టాక్స్‌ పేయర్లు 7.5 కోట్ల మందిలో 2022, జులై తొలి వారం వరకు కేవలం 99.20 లక్షల ఐటీఆర్‌లు మాత్రమే ఫైల్‌ చేశారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే 21 రోజుల్లో 6.5 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్‌ చేయడం అసాధ్యమని అంచనా వేశారు.