What Is The Gold Price in Dubai: కన్నడ నటి రన్యా రావు (Kannada Actress Ranya Rao), బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యారు. ఆమె ఇంట్లో జరిగిన సోదాల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్ల కొద్దీ డబ్బు దొరికాయి. దీంతో, దుబాయ్ - భారత్ మధ్య బంగారం అక్రమ రవాణా & రెండు దేశాల గోల్డ్ రేట్లలో వ్యత్యాసంపై ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
దుబాయ్‌లో బంగారం చవకేనా?
దుబాయ్‌లో బంగారు మార్కెట్ ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతోంది. అందువల్ల బంగారం దిగుమతులు, అమ్మకాలు, వ్యాపారానికి ప్రపంచంలో ముఖ్యమైన మార్కెట్‌గా మారింది. భారతదేశంలోని ధరలతో పోలిస్తే దుబాయ్‌లో బంగారం చౌకగా ఉంటుంది. ఈ నగరం చాలా కాలంగా బంగారం వాణిజ్య కేంద్రంగా ఉంది. ఏ సంవత్సరంలో చూసినా, ఈ ఎడారి నగరంలో పుత్తడి భారతదేశం కంటే తక్కువ ధరకు లభిస్తుంది. దుబాయ్‌లో బంగారం ఎందుకు చౌకగా ఉంటుంది? అంటూ ప్రజలు ఇప్పుడు గూగులమ్మను అడుగుతున్నారు.
భారత్ కంటే దుబాయ్‌లో బంగారం ధర తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాలు (Reasons why gold prices are lower in Dubai than in India)
* దుబాయ్‌లో బంగారం కొనుగోలుపై ఎలాంటి పన్ను ఉండదు. కాబట్టి, కొనుగోలుదారులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మార్కెట్ ధరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
* భారతదేశం వలె కాకుండా, దుబాయ్ బంగారంపై దిగుమతి సుంకం విధించదు. దీనివల్ల, వినియోగదారులకు కొనుగోలు ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.
* దుబాయ్ బంగారం మార్కెట్‌లో విపరీతమైన పోటీ ఉంటుంది. చాలామంది డీలర్లు, కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన ధరలు & డిస్కౌంట్లు ఇస్తారు.
* బయుత్ (Bayut) ప్రకారం, ఈ రోజు (సోమవారం, 10 మార్చి 2025), దుబాయ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు AED (UAE దిర్హామ్) 326.50. దీనిని భారతీయ రూపాయల్లోకి మారిస్తే ఒక గ్రాము ధర సుమారు 7,762 రూపాయలు. భారతదేశంలో, 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర 8,782 రూపాయలు. అంటే, ఒక్క గ్రాముకే దాదాపు 1,020 రూపాయలు తేడా వస్తోంది. కిలో బంగారానికి రూ. 10 లక్షలు పైగా తేడా ఉంటుంది.
భారతదేశంలోకి బంగారం దిగుమతి నిబంధనలు
బంగారం దిగుమతుల వల్ల వచ్చే ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని, భారత ప్రభుత్వం సంవత్సరాలుగా వివిధ సుంకాలు, నిబంధనలను ప్రవేశపెట్టింది. 2024 జులైలో, బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుంచి దాదాపు 6%కి తగ్గించింది. ఈ తగ్గింపు లక్ష్యం - అక్రమ రవాణాను తగ్గించడంతో పాటు చట్టబద్ధమైన దిగుమతులను ప్రోత్సహించడం, వినియోగదారులకు బంగారాన్ని మరింత తక్కువ ధరకు అందించడం.
దుబాయ్ నుంచి భారత్‌లోకి ఎంత బంగారం తీసుకురావచ్చు?
దుబాయ్‌లో బంగారం చౌకగా లభిస్తున్నప్పటికీ, దానిని భారతదేశానికి తీసుకురావడానికి అనేక నియమాలను పాటించాలి. 1967 పాస్‌పోర్ట్ చట్టం (Passport Act of 1967) ప్రకారం, భారతీయ ప్రయాణికులు అన్ని నిబంధనలు పాటిస్తూ, అంతర్జాతీయ విమానాలలో 1 కిలో వరకు బంగారం (ఆభరణాలతో కలిపి) తీసుకురావచ్చు. పురుషులు & స్త్రీలకు ఈ నియమాలు భిన్నంగా ఉంటాయి. పురుషులు తమ వెంట 20 గ్రాముల బంగారాన్ని (ఆభరణాలతో కలిపి) తీసుకెళ్లవచ్చు, దీనిపై కస్టమ్స్ సుంకం ఉండదు. కానీ, ఆ గోల్డ్ విలువ రూ.50,000 మించకూడదు. మహిళలు విమానంలో 40 గ్రాముల వరకు బంగారాన్ని (ఆభరణాలతో కలిపి) తీసుకెళ్లవచ్చు, దీనిపైనా కస్టమ్స్ సుంకం ఉండదు. ఈ కేస్‌లో పసిడి విలువ లక్ష రూపాయలకు మించకూడదు.
మరో ఆసక్తికర కథనం: పసిడి ప్రియులకు మళ్లీ షాక్, రూ.1100 జంప్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ