Credit Score - CIBIL Score: మన దేశంలో డిజిటల్‌ టెక్నాలజీస్‌ పెరిగిన తర్వాత బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణం (personal loan), గృహ రుణం (home loan), వెహికల్‌ లోన్‌ ‍‌(vehicle loan) సహా వివిధ రకాల లోన్లు తీసుకునే వాళ్ల సంఖ్య పెరిగింది. బ్యాంక్‌ లోన్లు గతంలో కన్నా ఇప్పుడు చాలా త్వరగా మంజూరు అవుతున్నాయి. అయితే, మంచి క్రెడిట్‌ స్కోర్ లేనిదే ఏ బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ అప్పు ఇవ్వడం లేదు.


మన దేశంలో నాలుగు కంపెనీలు వ్యక్తిగత క్రెడిట్‌ స్కోర్‌ను అందిస్తున్నాయి. అవి.. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ (TransUnion CIBIL), ఈక్విఫాక్స్‌ ఇండియా ( Equifax India), ఎక్స్‌పీరియన్‌ ‍‌(Experian), క్రిఫ్‌ హైమార్క్‌ (CRIF High Mark). అప్పు తీసుకున్నవాళ్లు తిరిగి చెల్లింపులు చేసే తీరును ఇవి ఎప్పటికప్పుడు గమనిస్తూ స్కోర్‌ను అందిస్తుంటాయి. బ్యాంకులు, NBFCలు, ఇతర ఆర్థిక సంస్థలు ఎక్కువగా సిబిల్‌ స్కోర్‌ను ఫాలో అవుతున్నాయి. 


క్రెడిట్‌ స్కోర్‌ అంటే?
క్రెడిట్ స్కోర్‌ అనేది మీ ఆర్థిక క్రమశిక్షణకు అంకెల రూపం. ఈ స్కోర్‌ మీ పాన్‌ కార్డ్‌కు లింక్‌ అయి ఉంటుంది. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న లోన్లను ('బయ్‌ నౌ పే లేటర్‌' సహా) తిరిగి సరిగా చెల్లిస్తున్నామో లేదో చెప్పే 3 అంకెల నంబర్‌ ఇది, 300-900 మధ్య ఉంటుంది. తీసుకున్న రుణాల మీద చేసే చెల్లింపుల ఆధారంగా ఈ 300-900 మధ్య ఒక నంబర్‌ను క్రెడిట్‌ స్కోర్‌గా కేటాయిస్తారు. ఈ స్కోర్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్నట్లు అర్ధం.


మంచి స్కోర్‌ - ఎక్కువ బెనిఫిట్స్‌ 
మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మంచి స్కోర్‌ ఉన్నవాళ్లకు వడ్డీ రేట్ల విషయలో బేరమాడే శక్తి ఉంటుంది. గుడ్‌ స్కోర్‌ కార్డ్‌ ఉన్న వాళ్లకు బ్యాంకులు ఇంట్రస్ట్‌ రేట్లను తగ్గిస్తాయి. లేదా, మీరు కోరుకున్న వడ్డీ రేటుకే అప్పును డిమాండ్‌ చేయవచ్చు. ఎక్కువ లోన్‌ కూడా అడగొచ్చు. కొత్త క్రెడిట్ కార్డ్‌ తీసుకోవాలన్నా, ఒక బ్యాంక్‌ నుంచి మరొక బ్యాంక్‌కు లోన్‌ మార్చుకోవాలన్నా ఆ పని వెంటనే ఓకే అవుతుంది. అంటే, మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. బ్యాంక్‌ ఆశించిన క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వాళ్లకు ఒక్కోసారి ప్రాసెసింగ్‌ ఛార్జీలను తగ్గిస్తారు, లేదా పూర్తిగా మాఫీ చేస్తారు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, ఇలాంటి ప్రయోజనాలేవీ అందవు.


ఎంత స్కోర్‌కు ఏంటి అర్ధం?
300 నుంచి 579: పూర్‌ లేదా అస్సలు బాగోలేదు. 
580 నుంచి 669: ఫెయిర్ లేదా పర్లేదు. 
670 నుంచి 739: గుడ్‌ లేదా బాగుంది
740 నుంచి 799: వెరీ గుడ్‌ లేదా చాలా బాగుంది
800 నుంచి 900 : ఎక్స్‌లెంట్‌ లేదా అద్భుతమైన స్కోరు


క్రెడిట్‌ స్కోర్‌ 'పూర్‌' సెగ్మెంట్‌లో ఉంటే, బ్యాంకులు లోన్లు ఇవ్వవు. 'ఫెయిర్'గా ఉంటే, లోన్‌ ఇవ్వాలా, వద్దా అని ఆలోచిస్తాయి. 'గుడ్‌' నుంచి 'ఎక్స్‌లెంట్‌' స్కోర్‌ ఉన్న వాళ్లకు లోన్లను వెంటనే శాంక్షన్‌ చేస్తాయి, కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉండొచ్చు.


సాధారణంగా, క్రెడిట్‌ స్కోర్‌ మూడు నెలలకు ఒకసారి మారుతుంది. ఇంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. స్కోర్‌ను ప్రొవైడ్‌ చేసే కంపెనీ పని విధానం మీద ఇది ఆధారపడి ఉంటుంది. 


ప్రస్తుతానికి క్రెడిట్‌ స్కోర్‌ ఇప్పుడు బాగున్నా, ఇకపై చేసే చెల్లింపులు గాడి తప్పితే, దానికి అనుగుణంగా స్కోర్‌ కూడా తగ్గుతుందని గుర్తుంచుకోండి.


మరో ఆసక్తికర కథనం: తక్కువ వడ్డీకే గృహ రుణం, సిబిల్‌ స్కోర్‌ లేకున్నా భారీ డిస్కౌంట్‌ - SBI ఫెస్టివ్‌ ఆఫర్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial