Home Insurance Benefits: జీవితం అనిశ్చితికి మారు పేరు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆకస్మిక కష్టనష్టాల నుంచి తప్పించుకోవడం కోసం బీమా లేదా పెట్టుబడులను రక్షణ కవచంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు, ఇన్సూరెన్స్‌ గురించి చాలామందికి అవగాహన ఉంది. లైఫ్‌ ఇన్సూరెన్స్ (Life Insurance), హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) గురించి తెలుసుకుంటున్నారు. అయితే, గృహ బీమా (Home Insurance) గురించి ప్రజలకు చాలా తక్కువ సమాచారం తెలుసు. హోమ్‌ ఇన్సూరెన్స్‌ను ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ (Property Insurance) అని కూడా పిలుస్తారు.


మానసిక ప్రశాంతతకు ఇది అవసరం
తెలుగు రాష్ట్రాలను వర్షాలు, వరదలు ఎలా వణికించాయో, ఈసారి ఎలాంటి విధ్వంసం సృష్టించాయో ఇటీవలే మనం చూశాం. అకస్మాత్తుగా వచ్చి పడిన వరదలకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్నాళ్ల క్రితం, కేరళలో కొండ చరియలు విరిగిపడి చోట్ల భారీ విధ్వంసం సంభవించింది. వందలాది ప్రాణాలు పోయాయి, లెక్కకు మించిన ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉత్తర భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో ఏటా ఇలాంటి సంఘటనలు సాధారణంగా మారాయి. ఆకస్మిక వరదల కారణంగా చాలా మంది ప్రజలు తీవ్రమైన పరిణామాలను అనుభవించవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో, సొంత ఇల్లు ఉన్నవారికి ఆర్థిక భద్రత, మానసిక ప్రశాంతత కోసం గృహ బీమా తప్పనిసరి.


మళ్లీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు
గృహ బీమా చేయించిన తర్వాత మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు. వరదల వల్ల ఇళ్లు, ఫర్నీచర్‌, గృహోపకరణాలు నష్టపోయిన వ్యక్తులు ఆ వస్తువులన్నింటినీ కొత్త వాటితో భర్తీ చేయడానికి మళ్లీ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.  గృహ బీమా పాలసీని ఎంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. హోమ్‌ ఇన్సూరెన్స్‌/ ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ మీ ఇంటిలోని ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా కవర్ చేస్తుంది.


ఇలాంటి ఇబ్బందుల నుంచి టెన్షన్ ఫ్రీ
గృహ బీమా తీసుకోవాలని మీరు ఆలోచిస్తుంటే, అందుబాటులో ఉన్న సెక్యూరిటీ ఫీచర్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా అగ్ని ప్రమాదం, అల్లర్లు, పిడుగుల తాకిడి నష్టం, పైకప్పు మీద నీటి ట్యాంకులు పగిలిపోవడం, పేలుడు, మెరుపులు, వరదలు, తుపాను, సునామీ వంటి మానవ జోక్యంతో & ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి ఇన్సూరెన్స్‌ పాలసీ రక్షణ అందిస్తుంది. ఆభరణాలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, ఫర్నీచర్‌కు జరిగిన నష్టానికి బీమా కంపెనీ నుంచి పరిహారం ఇప్పిస్తుంది.


ఏటా రెన్యువల్‌ అక్కర్లేదు
అల్లరిమూకల ఆగడాలు, తీవ్రవాద దాడులు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి వైపరీత్యాల నుంచి రక్షణ అందించే & మీ వాతావరణ అవసరాలకు సరిపోయే ఏదైనా యాడ్-ఆన్‌ని ఎంచుకోవడం చాలా కీలకం. తద్వారా మీరు మీ పాలసీ పరిధిని పెంచుకోవచ్చు, ఇంటికి రక్షణ కవచాన్ని బలోపేతం చేయవచ్చు. హోమ్‌ ఇన్సూరెన్స్‌లో వన్‌ ఇయర్‌ పాలసీలు, లాంగ్‌-టర్మ్‌ పాలసీలు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక పాలసీ తీసుకుంటే మీకు ప్రీమియం తగ్గడంతో పాటు ప్రతి సంవత్సరం దానిని రెన్యువల్‌ చేయాల్సిన అవసరం ఉండదు.


ఇంటి నిర్మాణ వ్యయం పెరుగుతున్నందున, దెబ్బతిన్న ఇంటిని మళ్లీ కట్టడం లేదా రిపేర్‌ చేయించడం ఖరీదైన వ్యవహారం. గృహ బీమా ఉంటే ఇక చింతించాల్సిన అవసరం లేదు, మీ ఉద్యోగం/వ్యాపారంపై మనశ్శాంతిగా దృష్టి పెట్టొచ్చు. ఇప్పుడు హోమ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం చాలా సులభం. ఎక్కడికీ వెళ్లక్కర్లేకుండా, మీ ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఈపీఎఫ్‌ మీద టాక్స్‌ ఎలా లెక్కిస్తారు? విత్‌డ్రా రూల్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి