Vadodara consumer forum: ఆసుపత్రిలో చేరి, కనీసం 24 గంటల పాటు చికిత్స తీసుకుంటేనే ఆరోగ్య బీమాను (Health Insurance) క్లెయిమ్‌ చేసుకోవడానికి వీలవుతుందంటూ చాలా బీమా కంపెనీలు నిబంధన విధిస్తుంటాయి. 24 గంటల కంటే తక్కువ సమయం ఆసుపత్రిలో ఉంటే, క్లెయిమ్‌ చేసుకోవడానికి వీల్లేదని కొర్రీలు పెడుతుంటాయి. ఇకపై బీమా కంపెనీలు ఈ సాకును చూపించలేవు, క్లెయిమ్‌ తిరస్కరించలేవు.


ఆస్పత్రిలో 24 గంటల కంటే తక్కువ సమయంలో చికిత్స పూర్తి చేసుకున్నా, లేదా ఆసుపత్రిలో చేరకున్నా ఆరోగ్య బీమా క్లెయిమ్‌ (Medical Insurance Claim) చేసుకోవచ్చని 'వడోదర వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్' (Vadodara Consumer Disputes Redressal Commission (additional)) తీర్పును వెలువరించింది. 


24 గంటలు ఆసుపత్రిలో లేరన్న బీమా కంపెనీ             
ఈ తీర్పు నేపథ్యాన్ని పరిశీలిస్తే... గుజరాత్‌లోని వడోదరకు చెందిన రమేష్‌ చంద్రజోషి భార్య డెర్మటోమయోసిటిస్‌ చికిత్స కోసం అహ్మదాబాద్‌లోని లైఫ్‌ కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. చికిత్స అనంతరం మరుసటి రోజున ఆమెను డిశ్చార్జి చేశారు. వారికి ఇన్సూరెన్స్‌ ఉండటంతో, రూ. 44,468 ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం జోషి దరఖాస్తు చేశారు. అయితే, బీమా సంస్థ ఆ క్లెయిమ్‌ను తిరస్కరించింది. పాలసీలోని క్లాజ్ 3.15 ప్రకారం కనీసం 24 గంటల పాటు ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకోలేదన్న కారణాన్ని చూపి, క్లెయిమ్‌ తిరస్కరించింది. జోషి, వడోదర వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. ఫోరమ్‌కు అన్ని పత్రాలను సమర్పించారు. తన భార్య నవంబర్ 24, 2016 సాయంత్రం 5.38 గంటలకు అడ్మిట్ అయ్యారని, నవంబర్ 25, 2016 సాయంత్రం 6.30 గంటలకు డిశ్చార్జ్ అయ్యారని వాదించారు. 


ఈ కాలంలో లెక్కలేంటన్న ఫోరమ్‌                  
ఈ లెక్క ప్రకారం జోషి భార్య 24 గంటల కంటే కొన్ని నిమిషాల తక్కువ సమయం మాత్రమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే, ఆధునిక యుగంలో కొత్త చికిత్స విధానాలు, మందులు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి, ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్సలు చాలా వేగంగా జరుగుతున్నాయని పేర్కొంటూ బాధితులకు క్లెయిమ్‌ చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది.


"ఆధునిక వైద్య పద్ధతుల వల్ల రోగి ఆసుపత్రిలో చేరే అవసరం లేకపోయినా, లేదా అడ్మిట్ అయిన తర్వాత తక్కువ సమయంలోనే చికిత్స పూర్తయినా, రోగి ఆసుపత్రిలో 24 గంటల పాటు చేరలేదని చెప్పడం ద్వారా బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించ కూడదు" - వడోదర వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్     


రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందో లేదో బీమా సంస్థ నిర్ణయించకూడదన్న వడోదర వినియోగదారుల ఫోరమ్‌.. కొత్త సాంకేతికత, మందులు, రోగి పరిస్థితి ఆధారంగా వైద్యులు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోగలరని పేర్కొంది.


క్లెయిమ్‌ను తిరస్కరించిన తేదీ నుంచి 9% వడ్డీతో పాటు జోషికి రూ. 44,468 చెల్లించాలని ఫోరమ్ బీమా సంస్థను ఆదేశించింది. బీమా తీసుకున్న జోషిని మానసికంగా వేధించినందుకు రూ. 3 వేలు, వ్యాజ్యం ఖర్చుల కోసం మరో రూ. 2 వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది.