UPI LITE Transaction Limit Increased: మన దేశంలో, యూపీఐ (Unified Payments Interface) ద్వారా చేసే చెల్లింపులు ఏటికేడు కొత్త రికార్డ్‌ సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో దాదాపు 1,700 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ. 23.48 లక్షల కోట్లకు పైగా ఉంది, ఏ నెలలోనైనా ఇదే అత్యధిక విలువ. దేశవ్యాప్తంగా, 80 శాతం రిటైల్ చెల్లింపులు ‍‌(చిన్న మొత్తాల్లో చెల్లింపులు) యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ముఖ్యంగా, మొత్తం P2M (వ్యక్తి నుంచి వ్యాపారికి) లావాదేవీల్లో 86 శాతం లావాదేవీలు రూ. 500 లోపులోనే ఉండడం విశేషం. 


UPI వాడకం రికార్డ్‌ స్థాయిలో పెరుగుతుండేసరికి, 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) & 'రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' (RBI) కలిసి ఈ ఆన్‌లైన్‌ చెల్లింపు విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. గత సంవత్సరం RBI చేసిన ప్రకటనకు అనుగుణంగా, UPI LITE పరిమితులను NPCI పెంచింది. 2024 డిసెంబర్ 4 నాటి RBI నోటిఫికేషన్ ప్రకారం, UPI లైట్ వాలెట్ ఒక లావాదేవీ పరిమితిని ఇప్పుడు రూ. 1000కి పెంచారు. మొత్తం పరిమితిని రూ. 5000కి పెంచారు. ఇది మాత్రమే కాదు, UPI లైట్ వాలెట్‌ను ఇప్పుడు అదనపు భద్రత (AFA)తో ఆన్‌లైన్ మోడ్‌లో రీఛార్జ్ చేసుకోవచ్చు. 


UPI లైట్‌లో కొత్త ఫీచర్‌
UPI లైట్‌లో "ఆటో టాప్-అప్" అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టారు. దీనిని ఆన్‌ చేస్తే, మీ బ్యాంక్ ఖాతా నుంచి UPI లైట్ ఖాతాకు పదేపదే డబ్బును బదిలీ చేయవలసిన అవసరం ఉండదు. దీని కోసం, మొదట మీరు టాప్-అప్ కోసం కనీస నిల్వ పరిమితిని సెట్ చేయాలి. ఉదాహరణకు... మీరు కనీస నిల్వగా రూ. 1000 పరిమితిని నిర్ణయించారని అనుకుందాం, అప్పుడు మీ UPI వాలెట్‌లోని బ్యాలెన్స్ తగ్గిన వెంటనే రూ. 1000 మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్‌ అవుతుంది, నేరుగా మీ UPI ఖాతాకు బదిలీ అవుతుంది. దీనివల్ల UPI లైట్‌ వాలెట్‌లో మీరు నిర్ణయించుకున్న కనీస బ్యాలెన్స్‌ ఎప్పుడూ ఉంటుంది, చెల్లింపులు చేయడం సులభం అవుతుంది. గతంలో, UPI వాలెట్‌లో ఉంచే గరిష్ట బ్యాలెన్స్ రూ. 2000 ఉండగా, ఇప్పుడు దానిని రూ. 3000 పెంచారు. 


కొత్త నిబంధన ఎప్పుడు అమలవుతుంది?
ఫిబ్రవరి 27న జారీ చేసిన సర్క్యులర్‌లో, లావాదేవీ పరిమితిని పెంచడం సహా అవసరమైన మార్పులు త్వరలో చేయాలని NPCI పేర్కొంది. ముందుగా, గత ఆరు నెలలుగా ఎటువంటి లావాదేవీలు జరగని UPI LITE ఖాతాలను సంబంధిత బ్యాంక్ గుర్తిస్తుంది. వీటిని ఈ నిష్క్రియాత్మక (ఇన్‌-యాక్టివ్‌) వాలెట్‌లుగా గుర్తించి, వాటిలోని మిగిలిన బ్యాలెన్స్ తిరిగి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తుంది. బ్యాంక్ చేసే అన్ని ఇతర మార్పులు జూన్ 30, 2025 నాటికి అమల్లోకి వస్తాయి.


UPI లైట్ అంటే ఏమిటి? (What is UPI Lite?)
UPI వాలెట్ ఆన్‌లైన్ వాలెట్‌ తరహాలో పనిచేస్తుంది. UPI కన్నా సులభంగా వాడడం కోసం దీనిని ప్రవేశపెట్టారు. UPI లైట్‌లో మీరు పిన్ ఎంటర్ చేయకుండానే రూ. 500 వరకు తక్షణ చెల్లింపులు చేయవచ్చు. ఈ పరిమితిని ఇప్పుడు రూ. 1000 కి పెంచారు. Google Pay, PhonePe, BHIM, Paytm వంటి 50కి పైగా UPI పేమెంట్‌ యాప్స్‌ ద్వారా యూపీఐ లైట్‌ను వినియోగించవచ్చు.


మరో ఆసక్తికర కథనం: 'జాయింట్‌ హోమ్‌ లోన్‌' తీసుకుంటున్నారా?, ఈ విషయాలు తెలీకుండా బ్యాంక్‌కు వెళ్లకండి