UPI Lite: డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించడానికి యూపీఐ లైట్ సౌకర్యాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రారంభించింది. UPIకి అప్‌డేటెడ్ వెర్షన్ లాంటిది ఇది. కానీ, UPIకి ఉన్నంత విస్తృత పరిధి మాత్రం UPI లైట్‌కు ఉండదు. నుండి లావాదేవీ ప్రక్రియను సులభతరం చేయడానికి UPI Lite ఫీచర్‌ను గతేడాది సెప్టెంబర్‌లోనే RBI తీసుకొచ్చింది. పేటీఎం, ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌లు దీనిని ప్రారంభించాయి.
మన దేశంలో, UPI ద్వారా జరిగే నగదు లావాదేవీలు గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగాయి. దేశంలోని పల్లె నుంచి నగరం వరకు అన్నిచోట్లా UPI ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. 2022 మే నెలలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం UPI లావాదేవీల్లో 50% లావాదేవీలు రూ. 200, అంతకంటే తక్కువ విలువైనవి. చిన్న పేమెంట్స్ ట్రాఫిక్ పెరగడం వల్ల బ్యాంక్ సర్వర్ల మీద ఒత్తిడి పెరిగి కొన్నిసార్లు చెల్లింపులు నిలిచిపోతున్నాయి. దీనికితోడు, UPIలో PIN ఎంటర్ చేయడం సహా ఇతర ప్రక్రియలు పూర్తి చేయడానికి కూడా కొంత సమయం పడుతుంది. వీటికి పరిష్కారంగా వచ్చిందే UPI లైట్.
UPI లైట్ అంటే ఏంటి?
UPI లైట్ వినియోగదార్లు, లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా 'ఆన్-డివైజ్' వాలెట్‌ని ఉపయోగించి లావాదేవీ చెల్లింపు పూర్తి చేస్తారు. అంటే బ్యాంక్ ఖాతా వరకు వెళ్లకుండా, కేవలం వాలెట్‌ని ఉపయోగించి వీలైనంత వేగంగా చెల్లింపు చేస్తారు. అయితే, ముందుగా ఆ వాలెట్‌లో డబ్బును జోడించాలి. UPI లైట్ వాలెట్‌లో ఒకేసారి గరిష్ఠంగా రూ. 2 వేల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా రోజుకు రెండుసార్లలో రూ. 4000 వరకు యాడ్ చేయవచ్చు.
చెల్లింపు విషయానికి వస్తే.. యూపీఐ లైట్‌తో ఒక లావాదేవీలో రూ. 200 వరకు చెల్లించవచ్చు, ఇలా ఒకరోజులో ఎన్ని లావాదేవీలైనా చేసుకోవచ్చు. PIN ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు, ఒక్క క్లిక్‌తో పని పూర్తవుతుంది. బ్యాంక్ సర్వర్ పని చేయకపోయినా యూపీఐ లైట్ పేమెంట్ ఆగదు. అవతలి వ్యక్తికి డబ్బు చేరుతుంది. BHIM యాప్ ఇప్పటికే UPI లైట్ ద్వారా లావాదేవీలను అనుమతించింది. UPI లైట్‌ను ప్రారంభించిన మొదటి డిజిటల్ పేమెంట్స్ యాప్‌గా Paytm అవతరించింది. ఫోన్‌పే కూడా ఇటీవలే దీనిని ప్రారంభించింది.
UPI లైట్ ప్రయోజనాలు
UPI లైట్ ఫీచర్‌లో లావాదేవీ గరిష్ట పరిమితి రూ. 200 మాత్రమే కాబట్టి మోసం జరిగే అవకాశాలు తగ్గిపోతాయి. ఒకవేళ యూపీఐ లైట్ వాలెట్‌లోని డబ్బును తిరిగి బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేయాలని అనుకుంటే, ఒక్క రూపాయి ఛార్జీ కూడా లేకుండా ఆ పని పూర్తి చేయవచ్చు.
Paytmలో యూపీఐ లైట్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
Paytmలో UPI లైట్‌ని సెట్ చేయడానికి, మీ iOS లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్‌ని తెరవండి. హోమ్ పేజీ ఎగువ ఎడమ మూలలో ఉన్న "ప్రొఫైల్" బటన్‌పై నొక్కండి. ఇప్పుడు "UPI & పేమెంట్ సెట్టింగ్స్" ఎంచుకోండి, ఆ తర్వాత, "అదర్ సెట్టింగ్స్" విభాగంలో "UPI లైట్" ఎంచుకోండి. ఇప్పుడు UPI లైట్‌కు అనుసంధానించే ఖాతాను ఎంచుకోండి. యూపీఐ లైట్‌ను యాక్టివేట్ చేయడానికి ఆ వాలెట్‌లోకి నగదు బదిలీ చేయండి. ఇప్పుడు మీరు యూపీఐ లైట్‌ను ఉపయోగించవచ్చు.
PhonePeలో యూపీఐ లైట్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
ఫోన్‌పే యాప్ తెరిచాక, హోమ్ పేజీలో కనిపించే ‘UPI Lite’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యూపీఐ లైట్ ఖాతాలో జమ చేయాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి. ఏ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు పంపాలో ఎంచుకోండి. యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే ‘UPI Lite’ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు, ఆపై ఏ క్యూర్ కోడ్‌నైనా స్కాన్ చేసి చెల్లింపు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: పని చేయకపోయినా 15 ఏళ్లుగా ₹8 కోట్ల జీతం, అయినా కంపెనీపై కేసు పెట్టిన ఉద్యోగి