Popular Government Investment Schemes: ఏ వ్యక్తయినా, తాన పని చేస్తున్న యవ్వన సమయంలోనే రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ప్రజలకు భవిష్యత్ ఆర్థిక భద్రతను అందించడంలో కీలకంగా నిలుస్తున్నాయి. సులభమైన పెట్టుబడి ఆప్షన్లతో పాటు ఆదాయ పన్ను ఆదా, ఆకర్షణీయమైన పెన్షన్, పిల్లల విద్యాఖర్చుల సమయంలో ఆదుకోవడం వంటి ప్రయోజనాలతో ఆ స్కీమ్‌లు బాగా పాపులర్ అయ్యాయి.
2025లో ప్రతి వ్యక్తి ఆర్థిక ప్రణాళికలో భాగం కావలసిన పథకాలు ఇవి:
1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PUBLIC PROVIDENT FUND): నమ్మకమైన పెట్టుబడుల విషయంలో ఇది బాగా పాపులర్ పథకం, జనాలకు బాగా చేరువైంది. ప్రస్తుతం, PPFలో పెట్టుబడులపై 7.10% వడ్డీ రేటు అందుతోంది. దీనిలో పెట్టుబడులు పన్ను రహితం. అంటే, సెక్షన్ 80C కింద ఆదాయ పన్ను నుంచి మిహాయింపు లభిస్తుంది. PPFలో పెట్టుబడుల లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలు, ఐదేళ్ల తర్వాత పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు.
2. సుకన్య సమృద్ధి యోజన (SUKANYA SAMRIDDHI YOJANA): బేటీ పఢావో, బేటీ బచావో ప్రచారం కింద ఈ పథకం ప్రారంభమైంది. ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజన (SSY) 7.60% వడ్డీ రేటును అందిస్తోంది. కుమార్తెలకు 10 ఏళ్లు నిండకముందు ఖాతా తెరవాలి. బాలిక విద్య & వివాహానికి ఇదొక అద్భుతమైన పథకం. సెక్షన్ 80C కింద ఆదాయ పన్ను నుంచి మిహాయింపు లభిస్తుంది.
3. అటల్ పెన్షన్ యోజన (ATAL PENSION YOJANA): రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం ఆదాయాన్ని అందించడానికి & ముఖ్యంగా, అసంఘటిత రంగాలలో పని చేసే వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి అటల్ పెన్షన్ యోజన (APY) రూపొందించారు. ఈ పథకంలో డబ్బు జమ చేసిన వ్యక్తులకు, 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత హామీతో కూడిన నెలవారీ పెన్షన్ వస్తుంది. ఇది రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు ఉంటుంది.
4. జాతీయ పెన్షన్ వ్యవస్థ (NATIONAL PENSION SYSTEM): ఈక్విటీ & డెట్ పెట్టుబడుల కలయికతో అధిక రాబడిని అందించే సత్తా ఉన్న పెన్షన్ పథకం NPS. చారిత్రకంగా, ఇది ఏటా 10-12% రాబడి ఇచ్చింది. NPS పెట్టుబడులపై సెక్షన్ 80C, 80CCD(1B) కింద రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. పదవీ విరమణ సమయంలో, మొత్తం పొదుపులో గరిష్టంగా 60% ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు, మిగిలిన 40% మొత్తాన్ని తప్పనిసరిగా పెన్షన్ యాన్యుటీ కోసం కేటాయించాలి.
5. కిసాన్ వికాస్ పత్ర (KISAN VIKAS PATRA): 10 సంవత్సరాల్లో, పెట్టుబడిదారులకు 100% రాబడిని సంపాదించిపెట్టే అసాధారణమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కిసాన్ వికాస్ పత్ర (KVP). ఇదొక నమ్మకమైన పెట్టుబడి ఎంపిక. ప్రస్తుతం 7.50% వడ్డీ రేటు ఉంది. పన్ను ప్రయోజనాలు లేవు. ఈ పథకానికి 2.5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది, ఆ తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
6. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SENIOR CITIZENS SAVINGS SCHEME): 60 ఏళ్లు & అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ పథకం (SCSS) వర్తిస్తుంది. ఏటా, 8.20% అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది. 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంది, ఆ తర్వాత 3 సంవత్సరాల చొప్పున పొడిగించుకోవచ్చు. పెట్టుబడులపై సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను ఉంటుంది.
7. ప్రధాన మంత్రి వయః వందన యోజన (PRADHAN MANTRI VAYA VANDANA YOJANA): సీనియర్ సిటిజన్‌ల కోసం LIC నిర్వహిస్తున్న పథకం ఇది. నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక పెన్షన్ చెల్లింపులు ఉంటాయి. సంవత్సరానికి 7.4 శాతం రాబడికి హామీ ఉంది. కనీస పెట్టుబడి మొత్తం రూ.15 లక్షలు. ఈ పెట్టుబడి పూర్తిగా రిస్క్ లేనిది & పెద్దవారికి (సీనియర్ సిటిజన్స్) స్థిరమైన ఆదాయం అందిస్తుంది.
8. లాడ్లీ లక్ష్మీ యోజన (LADLI LAXMI YOJANA): ఆడపిల్లల ఆర్థిక భద్రత కోసం ప్రారంభమైన పథకం ఇది. మధ్యప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో బాలికల విద్య & వివాహాలకు అండగా నిలుస్తుంది.
9. పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POST OFFICE MONTHLY INCOME SCHEME): స్థిరమైన నెలవారీ ఆదాయం కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్. POMISలో 7.40% వడ్డీ లభిస్తుంది. ఈ పథకం లాక్-ఇన్ వ్యవధి 5 సంవత్సరాలు. సింగిల్ అకౌంట్ కింద రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ కింద రూ.15 లక్షలు జమ చేయవచ్చు.
10. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MAHILA SAMMAN SAVINGS CERTIFICATE): ఇది మహిళల ప్రత్యేక పథకం & మహిళల ఆర్థిక సాధికారత MSSC లక్ష్యం. పథకం కాల వ్యవధి 2 సంవత్సరాలు. సంవత్సరానికి 7.50% వడ్డీ రాబడి అందుకోవచ్చు. స్వల్పకాలంలో మంచి రాబడి కోరుకునే మహిళలకు ఇది బెస్ట్ కావచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.