Check These Things While Buying A Plot: ఇల్లు కట్టుకోవడానికే కాదు, పెట్టుబడి ప్రయోజనాలు పొందడానికి కూడా ప్లాట్‌ కొనేవాళ్లు ఉంటారు. అంటే, తక్కువ ధరకు భూమి కొని, మంచి రేటు వచ్చిన తర్వాత దానిని అమ్మి లాభపడతారు లేదా అదే భూమిలో కలల ఇంటిని నిర్మించుకుంటారు. ఏ కారణంగాతో ప్లాట్‌ కొన్నప్పటికీ, కొనుగోలు సమయంలో తగిన శ్రద్ధ చూపకపోతే లాభం బదులు భారీ లాస్‌ మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్లాట్ కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని విషయాలు తనిఖీ చేయాలి. తద్వారా, మీ జీవితకాల సంపాదన టైటానిక్‌ షిప్‌ కాకుండా ఉంటుంది.

ప్లాట్‌ కొనేప్పుడు తనిఖీ చేయాల్సిన విషయాలు

టైటిల్ డీడ్ చెక్‌ చేయండిమీరు కొంటున్న లేదా కొనాలని ఆలోచిస్తున్న ప్లాట్‌కు సంబంధించిన టైటిల్‌ డీడ్‌ (రిజిస్ట్రేషన్‌ పేపర్లు) క్షణ్నంగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. మన సమయంలో మంచివాళ్లతో పాటు ముంచేవాళ్లు కూడా ఉన్నారు. టైటిల్ డీడ్‌ను తనిఖీ వల్ల ఆ భూమి ఎవరిదో (భూమి యజమాని) తెలుస్తుంది. భూమి యజమానికి మాత్రమే ఆ భూమిని అమ్మే హక్కు ఉంది. 

మ్యుటేషన్ రికార్డ్‌మీరు ప్లాట్ కొనుగోలు చేస్తున్న వ్యక్తి పేరు మీద ఆ భూమి రిజిస్టర్ అయిందో, లేదో చూడటానికి మ్యుటేషన్ రికార్డులను కూడా తనిఖీ చేయండి.

EC (Encumbrance Certificate) తీయించండిమీరు కొనబోయే భూమి రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికేట్ (EC) తీయించండి. ల్యాండ్‌ ఒరిజినల్‌ ఓనర్‌ కాకుండా వేరే ఎవరైనా మోసపూరితంగా మీకు ఆ భూమిని అమ్ముతున్నా, అది ప్రభుత్వ భూమి/అసైన్డ్‌ ల్యాండ్‌ అయినా, డబుల్‌ రిజిస్ట్రేషన్‌ జరిగినా, ఆ భూమిని తనఖా పెట్టి రుణం తీసుకున్నా... టైటిల్‌ డీడ్‌ను చెక్‌ చేయిచడం వల్ల తెలుస్తుంది. అసలు ఆ భూమి రిజిస్టర్ అయిందో, లేదో కూడా తెలుస్తుంది. EC వల్ల ఆ ప్లాట్‌లో ఏవైనా లోపాలు లేదా మోసాలు ఉంటే తెలుస్తాయి.     

ECని, రిజిస్ట్రేషన్‌ పేపర్లను, లింక్‌ డాక్యుమెంట్లను రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ దగ్గర ఉండే బ్రోకర్‌కు చూపించి చెక్‌ చేయించుకోవాలి. లాయర్‌ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఇవి చేయడానికి బద్ధకిస్తే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు & మీ డబ్బు అదే ప్లాట్‌లో మట్టిగొట్టుకు పోవచ్చు.  

NOC పేపర్లుఖాళీ స్థలం కొనుగోలు చేసేటప్పుడు గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి కచ్చితంగా నిరభ్యంతర పత్రం (No Objection Certificate - NOC) తీసుకోండి. మీరు కొనబోయేది వ్యవసాయ భూమి అయితే, దానిలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే, కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా పొందాలి. మీకు భూమి అమ్మే వ్యక్తే ఆ ల్యాండ్‌ను కన్వర్షన్‌ చేయించి, ఆ పత్రాలను మీకు అందించాలి.      

వెంచర్‌ బుక్‌మీరు ఏదైనా స్థిరాస్తి వెంచర్‌లో ప్లాట్‌ కొంటుంటే, వెంచర్‌ బుక్‌ అని ఉంటుంది దానిని కచ్చితంగా తీసుకోవాలి. ఆ వెంచర్‌ ప్లానింగ్‌ సహా అవసరమైన అనుమతి పత్రాల నకళ్లు వెంచర్‌ బుక్‌లో ఉంటాయి.